ధర్మపురి: శ్రీలక్ష్మీనృసింహస్వామి ఆలయంలో శనివారం దేవాదాయశాఖ కమిషనర్ హన్మంతరావు పూజలు చేశారు. ముందుగా ఆయన కు ఆలయం పక్షాన పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఈవో శ్రీనివాస్ స్వామివారి శేషవస్త్రం, ప్రసాదాలు అందించారు. కార్యక్రమంలో సూపరింటెండెంట్ కిరణ్‌కుమార్, సీనియర్ అసిస్టెంట్ అలువాలు శ్రీనివాస్, దేవస్థానం సిబ్బంది తదితరులున్నారు.
లండన్‌లో తెలంగాణ డే
రాయికల్: లండన్‌లో రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను శనివారం నిర్వహించారు. తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ యూకే (టాక్) బతుకమ్మలతో ప్రదర్శన, చిన్నారుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. భారత హైకమిషన్ పెరియ స్వామికుమరన్ టాక్ సంస్థ ప్రతినిధులను అభినందించారు. టాక్ అధ్యక్షుడు కడుగుల రత్నాకర్, వ్యవస్థాపక అధ్యక్షుడు కూర్మాచలం అనిల్, కమ్యునిటీ అఫైర్స్ చైర్‌పర్సన్ ముప్పాళ్ల గణేశ్, ప్రతినిధులు నవీన్, సురేశ్, సుప్రజ, నవ్య, తన్మయ పాల్గొన్నారు.
సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి
● డిప్యూటీ డీఎంహెచ్‌వో శ్రీనివాస్
గొల్లపల్లి: సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని డిప్యూటీ డీఎంహెచ్‌వో శ్రీనివాస్ అన్నారు. మండలంలోని రాపల్లెలో సీజనల్ వ్యాధులైన మలేరియా, డెంగీ నివారణ చర్యల్లో భాగంగా పర్యటించారు. పరిసరాలను పరిశీలించారు. డెంగీ ప్రబలకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలకు అవగాహన కల్పించారు. రక్తదానం ప్రాముఖ్యతను అధికా రులు, ప్రజలకు వివరించారు. కార్యక్రమంలో ఏఎంవో సత్యనారాయణ, ఏఎన్‌ఎంలు దేవేంద్ర, పుష్పలత, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.
పోలీస్‌స్టేషన్లను తరచూ తనిఖీ చేయాలి
ధర్మపురి: శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా ప్రతి పోలీస్‌స్టేషన్‌ను తరచూ తనిఖీలు చేయాలని ఎస్పీ అశోక్‌కుమార్ సీఐ రాంనర్సింహారెడ్డిని ఆదేశించారు. శనివారం ధర్మపురి పోలీస్ స్టేషన్‌ను ఎస్పీ సందర్శించారు. రికార్డులు, పెండింగ్ కేసుల పురోగతి, సిబ్బంది పనితీరును తెలుసుకున్నారు. కేసుల దర్యాప్తులో వేగం పెరగాలన్నారు. సైబర్ మోసాలు, వివిధ సామాజిక అంశాలు, ట్రాఫిక్ నియమాలపై, అవగాహన కల్పించాలని ఆదేశించారు. సీసీ కెమెరాలు గ్రామాల్లో ఏర్పాటు చేసుకునేలా ప్రజలకు వివరించాలన్నారు. డీఎస్పీ పురుషోత్తంరెడ్డి, ఎస్సైలు మహేష్, రవీందర్, సిబ్బంది తదితరులున్నారు.
బాధిత కుటుంబాలను ఆర్థికంగా ఆదుకోండి
● కలెక్టర్‌కు ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం సూచన
మల్యాల: ఉపాధి కోసం దుబాయ్ వెళ్లి.. రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలను ఆర్థికంగా ఆదుకోవాలని కలెక్టర్ సత్యప్రసాద్‌ను చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం కోరారు. మండలంలోని తక్కళ్లపల్లికి చెందిన గొల్లపల్లి తిరుపతి, కొడిమ్యాల మండలం నమిలకొండకు చెందిన సయ్యద్ సలీం, మెట్‌పల్లి మండలం గాజులపేటకు చెందిన అబ్దుల్ రఫీక్ దుబాయ్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విషయం తెల్సిందే. వారి మృతదేహాలను స్వగ్రామానికి తరలించేందుకు దుబాయ్ వెళ్లిన సత్యం.. తిరిగి వచ్చారు. శనివారం కలెక్టర్‌కు ఫోన్ చేసి బాధిత కుటుంబాలకు అండగా నిలవాలని కోరారు.


