● ఇటిక్యాలలో యువత కొత్త నిర్ణయం
● ఏ శుభకార్యమైనా ప్లాస్టిక్ ప్లేట్లు నిషేధం
● విస్తరాకుల తయారీలో ఉపాధి కూలీలు
రాయికల్: పాలిథిన్ ప్లేట్ల వాడకంతో అనారోగ్యంతోపాటు, పర్యావరణానికి తీవ్ర నష్టం వాటిల్లుతోంది. ఈ విషయాన్ని గుర్తించిన గ్రామంలోని 18 మంది యువకులు గ్రామంలో ఏ శుభకార్యం జరిగినా ప్లాస్టిక్ ప్లేట్లను వినియోగించద్దని తీర్మానించారు. నెల క్రితం సొంత డబ్బులు వెచ్చించి 1250 స్టీల్ ప్లేట్లు, 600 గ్లాసులు కొనుగోలు చేశారు. గ్రామంలో ఏ శుభకార్యం జరిగినా వారికి ఉచితంగా వీటిని అందిస్తున్నారు. ఇప్పటివరకు లక్షకు పైగా ప్లాస్టిక్ ప్లేట్లను వినియోగించకుండా చూడగలిగారు.
రాయికల్ మండలంలో ఇటిక్యాల మేజర్ గ్రామపంచాయతీ. ఇక్కడ సుమారు ఎనమిది వేల మంది జనాభా, 1800 గృహాలు, 25 నుంచి 30 వరకు కుల సంఘాలు ఉన్నాయి. ఏ శుభకార్యం జరిగినా.. ప్రజలందరూ ప్లాస్టిక్ ప్లేట్లు, ప్లాస్టిక్ గ్లాసులే వినియోగించేవారు. ఇది పర్యావరణానికి పెనుముప్పుగా మారిందని గమనించిన 18 మంది యువకులు ప్లాస్టిక్ ప్లేట్లను ఎలాగైనా నిర్మూలించాలని సంకల్పించారు. ప్రజలకు ఏదైనా ఉచితంగా ఇస్తేనే వారిలో మార్పు సాధ్యమని భావించి.. సొంత డబ్బులు వెచ్చించి సుమారు 1250 వరకు స్టీల్ ప్లేట్లు, 600 గ్లాసులు కొన్నారు. గ్రామంలో జరిగే ఏ శుభకార్యామైనా వీటిని ఉచితంగా అందిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. నాటి నుంచి నేటి వరకు గ్రామంలో ఏ శుభకార్యం జరిగినా ఈ ప్లేట్లు, గ్లాసులనే వినియోగిస్తున్నారు. దీనికి గ్రామంలోని కొందరు దాతలు కూడా ముందుకు వచ్చి ప్లేట్లను వితరణ చేస్తుండడం గమనార్హం.
ఆదర్శం.. ఆలూరు ఉపాధికూలీలు
విస్తరాకుల్లోనే భోజనం చేయాలన్న అధికారుల సూచనను మండలంలోని ఆలూరు గ్రామస్తులు విధిగా పాటిస్తున్నారు. ఉపాధి పనుల వద్ద పని ముగిసిన అనంతరం వందమంది సుమారు అరగంటపాటు మోదుగు ఆకులు సేకరించి విస్తార్లు కుడుతున్నారు. అందులోనే భోజనం చేస్తున్నారు. మిగిలిన విస్తార్లను దుకాణాల్లో విక్రయిస్తున్నారు.
ఇటిక్యాలలో స్టీల్ ప్లేట్లలో భోజనం చేస్తున్న యువకులు
ఆలూరులో విస్తారాకుల తయారీలో ఉపాధిహామీ కూలీలు


