ముందుచూపు ‘కరువు’ | - | Sakshi
Sakshi News home page

ముందుచూపు ‘కరువు’

Jun 13 2026 7:26 AM | Updated on Jun 13 2026 7:26 AM

● కోరుట్ల పట్టణంలో నీటి ఎద్దడి

కోరుట్ల: వేసవి నీటి ఎద్దడిని సరిగా అంచనా వేయడంలో మున్సిపల్‌ అధికార యంత్రాంగం, ప్రజాప్రతినిధులు విఫలమయ్యారు. ముందు జాగ్రత్త చర్యలు తీసుకోని కారణంగా పట్టణంలోని సగం వార్డుల్లో నీటి సమస్య తీవ్రతరంగా మారింది. ఈ వేసవిలో ఎండలు తీవ్రంగా ఉండడంతో పట్టణంలోని చాలా చోట్ల బోర్లలో నీరు ఇంకిపోయింది. నెల రోజుల ముందు నుంచి భూగర్భజలాలు పడిపోతున్నా, వేడి తీవ్రత తగ్గని పరిస్థితులు ఉన్నా అధికార యంత్రాంగం ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై పెద్దగా పట్టింపు చూపలేదు. నీటి ట్యాంకర్ల కోసం కేవలం రూ. 5 లక్షలు కేటాయించి చేతులు దులుపుకున్నారు.

అంతంత మాత్రంగా భగీరథ

జిల్లాలోని ముప్పావు వంతు గ్రామాలు, మున్సిపాల్టీలకు కో రుట్ల సెగ్మెంట్‌లోని ఇబ్రహీంపట్నం మండలం డబ్బా గ్రా మంలోని భగీరథ ప్లాంట్‌ ప్రధాన నీటి వనరుగా ఉంది. ఈ వేసవిలో డబ్బా వాటర్‌ గ్రిడ్‌కు శ్రీరాంసాగర్‌ నుంచి నీరు రా వడం క్రమేపీ తగ్గిపోయింది. దీంతో భగీరథ నల్లాల నుంచి నీటి సరాఫరా డీలా పడింది. రోజూ రావాల్సిన భగీరథ నీరు రోజు విడిచి రోజు వస్తుంది. సాధారణంగా మిషన్‌ భగీరథ నీటిని సాధారణ అవసరాలకు వాడుకుంటున్న జనం తాగునీటి కోసం బోర్లు, వాటర్‌ ప్లాంట్లను ఉపయోగిస్తున్నారు. చాలా చోట్ల బోర్లు ఎండిపోయాయి. ఫలితంగా నీటి సమస్య వేసవి ముగిసే సమయంలో తీవ్రతరంగా మారింది. దీనికి తోడు కోరుట్ల పట్టణంలో ఇప్పటి వరకు రెండుమూడు వాన జల్లులు మాత్రమే కురియడం సమస్యను మరింత పెంచింది.

ముదురుతున్న సమస్య

కోరుట్ల పట్టణంలో మొత్తం 33 వార్డులు ఉండగా తీవ్రమైన నీటి ఎద్దడి ఎనిమిది వార్డుల్లో ఉంది. మరో నాలుగు వార్డుల్లో వారం రోజులుగా నీటి సమస్య ముదురుతోంది. మిగిలిన వార్డుల్లోనూ నీటి సమస్య ఉన్నా పూర్తి స్థాయి తీవ్ర రూపం దాల్చలేదు. ఇంత తీవ్రమైన నీటి ఎద్దడిని ఊహించని అధికారులు మున్సిపాల్టీకి ఉన్న మూడు ట్యాంకర్లకు తోడు మరో మూడు ట్యాంకర్లను కాంట్రాక్టు కింద తీసుకున్నారు. ఆరు ట్యాంకర్లను నింపుకోవడానికి నీటి వనరులు లేకపోవడం మరో సమస్యగా మారింది. దాదాపు 12 వార్డుల్లో నీటి ఎద్దడి ఉండగా ఆరు ట్యాంకర్లు సరిపోవడం లేదు. కొన్ని వార్డుల్లో భగీరథ రాని రోజుల్లో వాటర్‌ ట్యాంకర్లు పంపుతుండగా మరికొన్ని వార్డుల్లో ఒకే రోజు పది వాటర్‌ ట్యాంకర్లు పంపినా నీటి ఎద్దడి తీరని దుస్థితి నెలకొంది. 12,13,14,15,2,1వ వార్డుల్లో నీటి ఎద్దడి ఫలితంగా తాగడానికి నీటి కొనుగోలు చేసి వాడుతున్నారు. కోరుట్ల వాగుకి సమీపంలో ఉన్న వార్డుల వారు బట్టలు ఉతుక్కోవడానికి వాగులోకి వెళ్తున్నారు. అక్కడ మురికి నీరు ఉండటంతో అవస్థలు పడుతున్నారు. ఇప్పటికై నా అధికార యంత్రాంగం పటిష్ట చర్యలు తీసుకుని జనం పాట్లు తొలగించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement