జగిత్యాలజోన్: సివిల్, క్రిమినల్ కేసుల్లో రాజీపడితే ఇద్దరూ గెలిచినట్టేనని జిల్లా ప్రధాన న్యాయమూర్తి సి.రత్నపద్మావతి అన్నారు. శుక్రవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. జిల్లాలో 17,396 కేసులు వివిధ కోర్టుల్లో విచారణలో ఉన్నాయన్నారు. మార్చిలో జరిగిన మొదటి జాతీయ లోక్ అదాలత్‌లో 3,033 కేసులు పరిష్కరించామని, ఈనెల 20న జరిగే లోక్ అదాలత్‌లో అత్యధిక కేసులు పరిష్కరించాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ఇందుకోసం జూన్ 20 వరకు వేచి చూడకుండా, ప్రతీ రోజు లోక్ అదాలత్‌లో కేసులు పరిష్కరించుకోవచ్చన్నారు. కోర్టులపై భారం తగ్గించేందుకు, అత్యధిక కేసులు లోక్ అదాలత్ ద్వారా పరిష్కరించేలా పోలీసులు, న్యాయవాదులు, ఇన్సూరెన్సు సంస్థలతో సమావేశాలు నిర్వహిస్తున్నామని వివరించారు. జిల్లా న్యాయ సేవా సంస్థ కార్యదర్శి, సబ్ జడ్జి నాగేశ్వర్‌రావు మాట్లాడుతూ, సామరస్యంగా కేసులు పరిష్కరించుకునేందుకు లోక్ అదాలత్‌ను ఉపయోగించుకోవాలని సూచించారు. కక్షిదారులు సత్వర న్యాయం పొందేందుకు చక్కని అవకాశమన్నారు.


