ఫిర్యాదులపై తక్షణం స్పందించాలి | - | Sakshi
Sakshi News home page

ఫిర్యాదులపై తక్షణం స్పందించాలి

Jun 12 2026 5:45 AM | Updated on Jun 12 2026 5:45 AM

మల్యాల: బాధితుల ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలని ఎస్పీ అశోక్‌కుమార్‌ అన్నారు. స్థానిక పోలీస్‌స్టేషన్‌ను గురువారం తనిఖీ నిర్వహించారు. కేసుల వివరాలు, పెండింగ్‌ కేసుల దర్యాప్తులో పురోగతి, సిబ్బంది హాజరును సమీక్షించారు. స్టేషన్‌ పరిధిలో అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా చర్యలు తీసుకో వాలని, రాత్రివేళల్లో నిఘా ముమ్మరం చేయాలని, యువత మాదకద్రవ్యాల బారినపడకుండా అవగాహన కల్పించాలని సూచించారు. మల్యాల సీఐ రవి, ఎస్సై నరేశ్‌ ఉన్నారు.

కేసీఆర్‌తోనే తెలంగాణకు భవిష్యత్‌

గంగాధర: కేసీఆర్‌తోనే తెలంగాణకు భవిష్యత్‌ అని, బీఆర్‌ఎస్‌ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని బీఆర్‌ఎస్‌ సెక్రటరీ జనరల్‌ తాటిపర్తి జీవన్‌రెడ్డి అన్నారు. మండలంలోని బూర్గుపల్లిలో బీఆర్‌ఎస్‌ సభ్యత్వ సదస్సును నిర్వహించగా ఎమ్మెల్సీ ఎల్‌.రమణతో కలిసి పాల్గొని మాట్లాడారు. ఎస్‌ఐఆర్‌ నేపథ్యంలో ఓటరు జాబితాలను క్షుణ్ణంగా పరిశీలించాలని కోరారు. హామీల అమలులో కాంగ్రెస్‌ పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో సుంకె రవిశంకర్‌, ఏనుగు రవీందర్‌ రెడ్డి, చిలుక రవిందర్‌, తిరుపతిరావు, శేఖర్‌, వినయ్‌ కుమార్‌, తదితరులు పాల్గొన్నారు.

ధాన్యం కొనుగోళ్లపై ఆరోపణలు తగవు

జగిత్యాల: ధాన్యం కొనుగోళ్లపై కొందరు నాయకుల ఆరోపణలు వాస్తవాలకు భిన్నంగా ఉన్నాయని కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షుడు గాజంగి నందయ్య అన్నారు. పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ.. ధాన్యం కొనుగోళ్లలో రూ.107 కోట్లకు పైగా అవినీతి జరిగిందని మాజీమంత్రి జీవన్‌రెడ్డి, కొప్పుల ఈశ్వర్‌ చేస్తున్న ఆరోపణలు నిరాధారమన్నారు. ప్రజల్లో అనుమానాలు రేకెత్తించేలా మాట్లాడటం కంటే ఆధారాలు బయటపెట్టాలన్నారు. మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌పై విమర్శలు చేయడం రాజకీయ కక్ష సాధింపు చర్యగా కనిపిస్తోందన్నారు. గతేడాదితో పోలిస్తే ఈసారి దిగుబడి పెరిగిందని, అయినా రైతులకు ఇబ్బంది లేకుండా కొనుగోలు చేస్తున్నామని తెలిపారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement