కాలువలు ఇలా.. నీరు పారేదెలా? | - | Sakshi
Sakshi News home page

కాలువలు ఇలా.. నీరు పారేదెలా?

Jun 12 2026 5:45 AM | Updated on Jun 12 2026 5:45 AM

● పిచ్చిమొక్కలు.. చెట్లపొదలు ● చివరి ఆయకట్టుకు చేరని నీరు ● ఏళ్ల తరబడి మరమ్మతుల్లేవ్‌

పెగడపల్లి: ఎస్సారెస్పీ కాలువలు ఏళ్ల తరబడిగా మరమ్మతుకు నోచుకోవడంలేదు. కాలువల్లో చెట్ల పొదలు పెరిగి చిట్టడవిని తలపిస్తున్నాయి. పలుచోట్ల డ్రాప్‌లు కూలిపోయాయి. ఎస్సారెస్సీ నుంచి నీరు విడుదలవుతుంటే రైతుల్లో ఒకవైపు హర్షం వ్యక్తమవుతుండగా.. మరోవైపు పూడికమట్టి, పెరిగిన చెట్ల పొదలతో చివరి ఆయకట్టుకు నీరు చేరక ఆందోళన చెందుతున్నారు. కాకతీయ ప్రధాన కాల్వకు అనుబంధంగా ఉన్న డీ–83ఏ కాలువ ద్వారా ఉప కాల్వలకు నీరు సరఫరా అవుతోంది. ఈ కాల్వల ద్వారా పెగడపల్లి మండలంలో పది వేల ఎకరాల ఆయకట్టు ఉంది. మండలం పూర్తిగా వ్యవసాయంపై ఆధారితం కావడంతో ఎస్సారెస్సీతోపాటు బావులు, చెరువులు, కుంటల ఆధారంగా రైతులు పంటలు సాగు చేస్తున్నారు. ఇక్కడి భూముల సాగుకు ప్రధాన నీటివనరు కాకతీయ కాలువ. కాలువల ద్వారా పంట పొలాలకు నీరు పారించుకుందామనుకుంటున్న సమయంలో అవి సక్రమంగా లేక ఇబ్బంది పడుతున్నామని రైతులు చెబుతున్నారు. మండలంలోని డీ–83ఏ ప్రధాన కాల్వ కింద 74, 75, 76, 77, 78, 79, 80, 81 డిస్ట్రిబ్యూటరీ కాలువలు ఉన్నాయి. డీ 76, 77 కింద 1ఎల్‌, 2ఆర్‌, 3ఎల్‌, 4ఆర్‌ ఉప కాలువలు ఉన్నాయి. వీటి ద్వారా పెగడపల్లి, మద్దులపల్లి, బతికపల్లి, ఎల్లాపూర్‌, నంచర్ల, ల్యాగలమర్రి తదితర గ్రామాలకు నీరు అందుతోంది. అయితే వాటికి ఏళ్లతరబడి మరమ్మతుల్లేక అధ్వానంగా మారాయని రైతులు చెబుతున్నారు. నీటి విడుదలకు ముందుగానే మరమ్మతు చేస్తే బాగుంటుందని అంటున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement