పరిహారం.. పరిహాసం | - | Sakshi
Sakshi News home page

పరిహారం.. పరిహాసం

Jun 11 2026 7:41 AM | Updated on Jun 11 2026 7:41 AM

నృసింహుని ఆలయ అభివృద్ధికి భూ సేకరణ పరిహారం ఎంతిస్తారో ప్రకటించని ప్రభుత్వం విస్తరణలో ఇళ్లు కోల్పోతున్న బాధితులు మార్కెట్‌ ధర చెల్లించాల్సిందేనని పట్టు

ధర్మపురి: ధర్మపురి శ్రీలక్ష్మీనృసింహుని ఆలయానికి ఏటేటా భక్తులు పెరుగుతున్నారు. పురాతన ఆలయానికి నెలవైన ఇక్కడ నాటికాలంలోనే ప్రజలు ఆలయం చుట్టూ ఇళ్లు నిర్మించుకుని ఇప్పటికీ నివాసముంటున్నారు. క్రమేణా భక్తుల సంఖ్య పెరుగుతుండడం.. పురాతన ఇళ్లు అలాగే ఉండడం.. రద్దీ పెరిగిన సమయంలో ఇబ్బందులు ఎదురవడం ఇక్కడ సర్వసాధారణంగా మారింది. దీంతో ఆలయ విస్తరణ అంశం ఎప్పటినుంచో తెరపైకి వస్తోంది. ఆలయాన్ని విస్తరించాలంటే చుట్టూరా ఉన్న ఇళ్లను తొలగించాల్సి వస్తుంది. అయితే బాధిత కుటుబాలకు ప్రభుత్వం చెల్లిస్తున్న పరిహారం పరిహాసంగా మారింది. తాతముత్తాల కాలంలో నిర్మించిన ఇళ్ల కాపాడుకుంటూ వస్తున్నామని, ఇప్పుడు తొలగించాల్సిందేనంటూ ప్రభుత్వం తమకు అన్యాయం చేస్తోందని బాధితులు పేర్కొంటున్నారు. మరోవైపు ఇళ్ల స్థలాలకు ప్రభుత్వం నుంచి గజానికి కేవలం రెండు వేలు మాత్రమే చెల్లిస్తారని వస్తున్న వదంతులు బాధితులను కలవరపెడుతున్నాయి. మార్కెట్‌ ధర చెల్లించకుంటే ఇళ్లు ఖాళీ చేయబోమని చెబుతున్నారు.

విస్తరణ ఇలా..

నృసింహుని ఆలయానికి పెరుగుతున్న భక్తులకు సరిపడా వసతులు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రధానంగా నందీచౌక్‌ నుంచి ఆలయం వరకు.. మంగలిగడ్డ నుంచి బ్రాహ్మణ సంఘంవరకు నిత్యం భక్తులతోపాటు వాహనాల రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఆ సమస్యను అధిగమించాలంటే విస్తరణ తప్పనిసరిగా మారింది. వాహనాల పార్కింగ్‌, వాటి రాకపోకలకు ఇరువైపులా విశాలమైన రోడ్డు, భక్తులు సేద తీర్చుకోవడానికి వసతి గృహాలు, ప్రత్యేక నీడ, నీటి వసతులు కల్పించాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ చేయాలంటే ఆలయానికి సమీపంలో ఉన్న సుమారు 17 మంది ఇళ్లను తొలగించాల్సి వస్తోంది.

ఏడున్నర ఎకరాలు అవసరం

ఆలయ విస్తరణకు మొత్తం ఏడున్నర ఎకరాలను ప్రభుత్వం సేకరించనున్నట్లు అధికారుల లెక్కల ద్వారా తెలిసింది. ఇందులో సుమారు 17మంది ఇ ళ్లు కోల్పోతారని గుర్తించారు. ఉత్తరం వైపున 1.03 ఎకరాలు సేకరించాల్సి ఉంటుంది. ఇందులో సు మారు 17 మంది ఇళ్లు ఉన్నాయి. అలాగే బ్రాహ్మణ సంఘం పక్కనున్న 2.4 ఎకరాలు, (శ్రీమఠం స్థలం), గోదావరి తీరాన మంగలిగడ్డ ఏరియాలో 4.16 ఎకరాలు అవసరమని ప్రభుత్వం గుర్తించింది.

ఏళ్లుగా కొనసాగుతున్న ప్రక్రియ

ఆలయ అభివృద్ధికి సమీపంలోని భూములు సేకరించాల్సి ఉందని, అందులో ఉన్న నిర్మాణాలను ఖాళీ చేయాలని, నిర్వాసితులకు పరిహారం చెల్లిస్తామని గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాం నుంచే చెబుతూ వస్తున్నారు. అప్పటి మంత్రి కొప్పులఈశ్వర్‌ భూ నిర్వాసితులతో పలుమార్లు అవగాహ న సమావేశాలు కూడా నిర్వహించారు. అయితే ప్రభుత్వం ఇస్తామన్న పరిహారం సరిపోదంటూ బాధితులు తమ అసంతృప్తిని వెలుబుచ్చుతూ వస్తున్నారు. తాజాగా 2027లో గోదావరి పుష్కరాల నేపథ్యంలో విస్తరణ అంశం మరోసారి తెరపైకి వచ్చింది. భక్తుల తాకిడిని తట్టుకోవాలంటే ఆలయ విస్తరణ తప్పనిసరి అని అధికారులు గుర్తించారు.

బాధితులతో మంత్రి సమీక్షలు

ఆలయ అభివృద్ధి పనులకు సహకరించాలని మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ బాధితులతో పలుమార్లు చర్చలు జరిపారు. నిర్వాసితులను ప్రభుత్వపరంగా ఆదుకుంటామని, వారికి అన్ని సౌకర్యాలు కల్పిస్తామని అవగాహన కల్పిస్తున్నారు. మరోవైపు ఆలయ పరిసరాల్లో.. ఆలయ అభివృద్ధికి దోహదపడే భూములు, ఇళ్లను ఎవరూ అమ్మవద్దని, కొనవద్దని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఇందులో భాగంగా ఏడున్నర ఎకరాలను బ్లాక్‌ లిస్టులో పెట్టారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement