అధికారులు సీజ్ చేసిన 3వేల ట్రిప్పుల ఇసుక ఏమైంది..?
రూ.30లక్షలు ఎవరి జేబుల్లోకి వెళ్లాయో చెప్పండి
హిట్లర్ ఆదర్శమన్న రేవంత్‌కు అదే గతి పడుతుంది
నేనెక్కడున్నా ప్రజాపక్షమే
మాజీమంత్రి జీవన్‌రెడ్డి
జగిత్యాలటౌన్: ప్రపంచంలోనే పేరు మోసిన నేరస్తుడు హిట్లర్ అని, ఆయనే తనకు ఆదర్శమన్న సీఎం రేవంత్‌రెడ్డికీ హిట్లర్ పట్టిన గతే పడుతుందని మాజీమంత్రి, బీఆర్‌ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవన్‌రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో బుధవారం విలేకరులతో మాట్లాడారు. మేనిఫెస్టోలో ప్రకటించిన హామీలు అమలు చేయాలంటే హిట్లర్‌లా అణిచివేతకు పాల్పడుతున్న రేవంత్‌కు అదే గతి తప్పదని హెచ్చరించారు. బీఆర్‌ఎస్ కండువా కప్పుకోగానే తాను మాటమార్చారంటున్న మంత్రి అడ్లూరి వ్యాఖ్యలపై స్పందిస్తూ.. తానెప్పుడు ప్రజాపక్షమేనని, అడ్లూరి మంత్రి కాగానే సమస్యలన్నీ మాయమైపోయినట్లు వాస్తవాలకు భిన్నంగా మాట్లాడటం సరికాదని హితవు పలికారు. ధాన్యం సేకరణలో వాస్తవాలు ఒకలా ఉంటే మంత్రి మరోలా మాట్లాడుతున్నారని, మిల్లర్ల దోపిడీతో జిల్లా రైతులు రూ.125 కోట్లు నష్టపోయారని, ఇందులో నాయకులు, అధికారుల వాటా ఎంతో అడ్లూరి చెప్పాలని డిమాండ్ చేశారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు రశీదు ఇచ్చిన ధాఖలాలు లేవని, ధర్మకాంట, ట్రక్‌షీట్ మధ్య వ్యత్యాసం ఎందుకుందో చెప్పాలని, మిల్లర్ల దోపిడీకి ఇదే నిదర్శనమని పేర్కొన్నారు. మంత్రికి రైతుల పట్ల నిజంగా చిత్తశుద్ధి ఉంటే ట్రక్‌షీట్ ప్రకారం చెల్లింపులు జరిగేలా చూడాలని హితవు పలికారు. గోదావరి పరీవాహక ప్రాంతంలో రెవెన్యూ అధికారులు సీజ్ చేసిన 3వేల ట్రాక్టర్ ట్రిప్పుల ఇసుక డంప్ ఏమైందో చెప్పాలన్నారు. ఆ ఇసుకకు సంబంధించిన రూ.30లక్షలు ప్రభుత్వ ఖజానాకు జమచేశారా..? లేక ఎవరి జేబుల్లోకి వెళ్లాయో మంత్రి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. వీటిపై మంత్రి, కలెక్టర్ స్పందించి విచారణకు ఆదేశించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో జెడ్పీ మాజీ చైర్‌పర్సన్ దావ వసంత, నాయకులు సురేందర్, పుప్పాల అశోక్, వెంకటేశ్వర్‌రావు, దుర్గయ్య, నేహాల్, అబ్దుల్ భారీ, చందా రాధాకిషన్ తదితరులు పాల్గొన్నారు.


