ఏటా ముంపు.. కానరాని కనువిప్పు | - | Sakshi
Sakshi News home page

ఏటా ముంపు.. కానరాని కనువిప్పు

Jun 10 2026 1:31 AM | Updated on Jun 10 2026 1:31 AM

మున్సిపాలిటీల్లో పొంచి ఉన్న వరద భయం ముందస్తు చర్యలు చేపట్టని అధికారులు ఆందోళనలో శివారు కాలనీల ప్రజలు

గత వర్షాకాలంలో వెంకటాద్రినగర్‌లో వరద బీభత్సం

కోరుట్లలోని ప్రకాశం, ముత్యాలవాడలను ముంచెత్తిన వరద (ఫైల్‌)

జిల్లాకేంద్రంలో 50 వార్డులు ఉన్నాయి. లక్ష జనాభాతో స్పెషల్‌ గ్రేడ్‌ మున్సిపాలిటీగా ఉంది. కానీ ఇక్కడ పరిస్థితులు మాత్రం అందుకు భిన్నంగా ఉన్నాయి. కొన్ని లోతట్టు ప్రాంతాలు మునిగిపోయే ప్రమాదం ఉన్నప్పటికీ చర్యలు చేపట్టడం లేదు. ముఖ్యంగా గోవిందుపల్లి, వెంకటాద్రినగర్‌, ఇందిరనగర్‌, దగ్గులమ్మ, చిలుకవాడ, టాకాసంది, కృష్ణానగర్‌లోని కొన్ని ప్రాంతాలు వర్షం పడిందంటే వరదలతో ముంచేస్తుంటాయి. గోవిందుపల్లి వెంకటాద్రినగర్‌ మధ్య ధరూర్‌ వాగుపై కొన్నేళ్ల క్రితం నిర్మించిన లోలెవల్‌ వంతెన వరద నీరు వస్తే అటువైపు ప్రజలకు.. ఇటువైపు ప్రజలకు మధ్య సంబంధాలు తెగిపోతాయి. వారికి పాలు, మెడిసిన్‌, ఇతరత్రా సామగ్రి దొరకాలంటే ఇబ్బందికరంగా మారుతుంది. రోడ్లన్నీ చెరువులను తలపిస్తూ రాకపోకలకు అంతరాయం ఏర్పడతాయి. వరద ఉధృతిని తగ్గించేందుకు యావర్‌రోడ్‌లో డైవర్షన్‌ రోడ్డు నిర్మించాలని ప్రజలు కోరుతున్నారు.

కోరుట్లలో అదే పరిస్థితి...

కోరుట్ల మున్సిపాలిటీలో గత ఏడాది ముఖ్యమైన కాలనీల్లో దాదాపు 80 ఇళ్లు ముంపు నీటికి గురయ్యాయి. పగటి వేళ కావడంతో ప్రజలు అప్రమత్తమై బయటపడ్డారు. రాత్రి వేళ ముంపునీరు వచ్చి ఉంటే ప్రాణాలకే ముప్పు ఏర్పడేది. ప్రకాశం రోడ్‌, కల్లూరురోడ్‌, అయిలాపూర్‌, ముత్యాలవాడ ప్రాంతాల్లో ముంపుతో జనం సతమతమవుతున్నారు.

భరోసా ఏదీ?

వరదలు వచ్చిన సందర్భంలో శాశ్వత పరిష్కారాానికి అధికారులు చర్యలు చేపట్టడం లేదు. వరదలు వచ్చిన అనంతరం పరిశీలించి చర్యలు తీసుకుంటామని అధికారులు చెబుతున్నారే తప్ప పరిష్కారం మాత్రం పట్టించుకోవడం లేదు. చిన్నపాటి వర్షానికే కాలనీలన్నీ జలమయం అవుతుంటే కనీసం ప్రజాప్రతినిధులు, అధికారులు పట్టించుకోవడం లేదు. ధర్మపురి గోదావరి పరీవాహక ప్రాంతంలో వానాకాలంలో బిక్కుబిక్కు మంటూ గడపాల్సిన పరిస్థితి నెలకొంది. వర్షాకాలం అంటేనే హడలిపోతున్నారు. అధికారులు స్పందించి చర్యలు తీసుకుంటే తప్ప చేసేదేమీలేదు.

భారీ వర్షాలు కురిసే అవకాశాలను దృష్టిలో ఉంచుకుని లోతట్టు ప్రాంతాలను ముందుగానే గుర్తించి అక్కడ ముందస్తుగా ప్రజలను అప్రమత్తం చేసేలా చర్యలు తీసుకుంటాం. ప్రణాళికలు రూపొందించాం. ప్రజలకు ఇబ్బంది కలగకుండా అన్ని చర్యలు చేపడతాం.

– సత్యప్రసాద్‌, కలెక్టర్‌

లోతట్టు ప్రాంతాలను గుర్తించి

చర్యలు తీసుకుంటాం

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement