రాయికల్: బల్దియాలో ప్రధాన సమస్యగా మారింది ఒకటో వార్డులోని మాదిగకుంట. పట్టణంలోని మురికినీరంతా చేరేది ఈ కుంటలోకే. వర్షాకాలంలో 12వార్డుల మురికినీరంతా ఈ కుంటలోకి వచ్చి చేరడం ద్వారా దోమలు స్వైరవిహారం చేస్తుంటాయి. ఏటా ప్రజలు మలేరియా, డెంగి వంటి వ్యాధుల బారిన పడి వైద్య ఖర్చులకు రూ.లక్షలు వెచ్చిస్తున్నారు. ఈ కుంటలోని మురికినీటిని తొలగించి పట్టణ ప్రజలకు శాశ్వత పరిష్కారం అందించే దిశగా కలెక్టర్ సత్యప్రసాద్ ఈ ఏడాది మార్చి 10న స్వయంగా పరిశీలించి యుద్ధప్రతిపాదికన చర్యలు చేపట్టాలని అప్పటి మున్సిపల్ కమిషనర్ కీర్తి నాగరాజు, ఆర్డీవో, ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. అయినప్పటికీ ఇప్పటివరకు ఆ దిశగా అడుగులు మాత్రం పడలేదు.


