జగిత్యాలరూరల్: సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డిప్యూటీ డీఎంఅండ్‌హెచ్‌వో జైపాల్ రెడ్డి అన్నారు. జగిత్యాల రూరల్ మండలం కల్లెడ గ్రామంలో ఏరియా ఆస్పత్రి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్యశిబిరాన్ని సందర్శించారు. వర్షాకాలంలో డెంగీ, మలేరియా వైరల్ జ్వరాలు, అతిసారం వంటి సీజనల్ వ్యాధులు వచ్చే అవకాశం ఉందని, ప్రజలు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం, నీరు నిల్వ లేకుండా జాగ్రత్తలు తీసుకోవడం, శుభ్రమైన నీటిని మా త్రమే తాగడం ద్వారా వ్యాధులను నియంత్రించవచ్చని పేర్కొన్నారు. కార్యక్రమంలో వైద్యులు కడార్ల వేణుకుమార్, సర్పంచ్ గంగోత్రి, మాజీ ఎంపీటీసీ పరుశురాం పాల్గొన్నారు.
ఓటర్ల జాబితాలో లోపాలు లేకుండా చూడాలి
ఇబ్రహీంపట్నం: ఓటర్ల జాబితాలో లోపాలు లేకుండా చూడాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రాచకొండ యాదగిరిబాబు కార్యకర్తలకు సూచించారు. మండలకేంద్రంలో పార్టీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. ప్రతి కార్యకర్త పార్టీ బలోపేతం కోసం క్షేత్రస్థాయిలో కృషి చేయాలన్నారు. పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అనూప్‌రావు, జిల్లా ప్రధాన కార్యదర్శి వోడ్డెపల్లి శ్రీనివాస్, రాష్ట్ర కౌన్సిల్ మెంబర్, మండల ఇన్‌చార్జి ఏలేటి నరేందర్‌రెడ్డి, మండల ప్రధాన కార్యదర్శులు పంతంగి వెంకటేశ్‌యాదవ్, రణదీర్, జిల్లా నాయకులు పాల్గొన్నారు.
సత్యానంద మహర్షి బోధనలు అనుసరణీయం
కోరుట్ల: భగవాన్ సత్యానంద మహర్షి బోధనలు, సేవా కార్యక్రమాలు సమాజానికి ఆదర్శప్రాయమని ఆధ్యాత్మిక గురువులు ప్రవచించారు. పట్టణంలో మూడురోజులపాటు నిర్వహించిన భగవాన్ శ్రీసత్యానంద మహర్షి 500 సంచార సత్సంగ్ మహోత్సవాలు ఆదివారంతో ముగిశాయి. ఈ సందర్భంగా ఉదయం, సాయంత్రం ఆధ్యాత్మిక ప్రవచనాలు, భజనలు, గురుస్మరణ, ధ్యాన కార్యక్రమాలు సత్సంగాలు, శాంతి మంత్రాలు నిర్వహించారు. కార్యక్రమంలో భగవాన్ శ్రీసత్యానంద మహర్షి భక్తమండలి, కోరుట్ల 500 సంచార సత్సంగ మహోత్సవాల నిర్వహణ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
ధాన్యం కొనుగోళ్లలో మిల్లర్ల దోపిడీ
● అడ్డగోలు కోతలపై మిల్లర్‌ను ప్రశ్నించిన రైతు
● ‘బిచ్చగాడివా.. గరీబోనివా’ అంటూ నోరుపారేసుకున్న మిల్లర్
మెట్‌పల్లిరూరల్: ధాన్యం కొనుగోళ్లలో రైతులు దోపిడీకీ గురువుతున్నారు. నాణ్యత పేరుతో మిల్లర్లు రైతులను ముప్పుతిప్పలు పెడుతున్నారు. మెట్‌పల్లి మండలం కొండ్రికర్లలోని ఓ రైస్‌మిల్లర్ ధాన్యంలో తాలు, తప్ప పేరుతో నిలువు దోపిడీకి గురిచేస్తున్నట్లు రైతులు ఆరోపిస్తున్నారు. కొండ్రికర్లకు చెందిన ఆకుల శ్రీనివాస్ 1,308 బస్తాల ధాన్యాన్ని కొనుగోలు కేంద్రంలో విక్రయించగా.. దానిని మహాలక్ష్మీ రైస్‌మిల్‌కు తరలించారు. మిల్లు యజమాని గంగారెడ్డి 65 బస్తాల ధాన్యం కోత విధించాడు. దీంతో శ్రీనివాస్ మిల్లుకు చేరుకుని అంతమొత్తం కోత విధించడం సరికాదన్నాడు. దీంతో గంగారెడ్డి ‘నువ్వు బిచ్చగాడివా..గరిబోనివా’ అంటూ దుర్భషలాడాడని రైతు శ్రీనివాస్ కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు జువ్వాడి కృష్ణారావు దృష్టికి తీసుకెళ్లాడు. స్పందించిన ఆయన ముందుగా రైస్‌మిల్లర్‌తో మాట్లాడారు. అయినప్పటికీ గంగారెడ్డి వినలేదు. శ్రీనివాస్ మరోమారు ఆయన దృష్టికి తీసుకెళ్లగా ఆదివారం మిల్లుకు చేరుకుని వివరాలు తెలుసుకున్నారు. రైతుకు అన్యాయం చేస్తే సహించేదిలేదంటూ విషయాన్ని రెవెన్యూ, పోలీస్ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దీనికి రైస్‌మిల్లర్ జవాబు ఇస్తూ.. జిల్లా అంతటా ఇలానే జరుగుతోందని చెప్పడం గమనార్హం.


