50 శాతానికి కుదింపు జిల్లాకు చేరిన విత్తనాలు జీలుగ బస్తా రూ.2452 జనుము బస్తా రూ.3,110 రైతులకు విక్రయాలు షురూ
జగిత్యాలఅగ్రికల్చర్: రైతులు భూసారం పెంచేందుకు తొలకరి కురవగానే జనుము, జీలుగ వంటి పచ్చిరొట్ట విత్తనాలు చల్లుతుంటారు. ఈ విత్తనాలను ప్రభుత్వం సబ్సిడీపై సరఫరా చేస్తుంది. అయితే గతేడాది 60శాతం ఉన్న సబ్సిడీని ఈ ఏడాది 50శాతానికి కుదించింది. పైగా విత్తనాల ధర కూడా గతేడాదితో పోల్చితే బాగా పెరిగింది. ఓ వైపు సబ్సిడీ తగ్గింపు.. మరోవైపు రేట్లు పెరగడంతో రైతులు పెదవి విరుస్తున్నారు.
13,400 క్వింటాళ్ల పచ్చిరొట్ట విత్తనాలు
జిల్లాకు 13,400 క్వింటాళ్ల పచ్చిరొట్ట విత్తనాలు అవసరమని వ్యవసాయ శాఖ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. ఇప్పటివరకు 12,491 క్వింటాళ్లు మాత్రమే చేరాయి. ఇందులో 827 క్వింటాళ్ల జనుము, 11,674 క్వింటాళ్ల జీలుగ విత్తనాలు రాగా.. సింగిల్‌విండోలు, డీసీఎంఎస్ కేంద్రాల ద్వారా రైతులకు పంపిణీ చేస్తున్నారు. వరిధాన్యం, మక్కల డబ్బులు ఇంకా రైతుల ఖాతాల్లో జమకాకపోవడంతో పచ్చిరొట్ట విత్తనాలు కొనేందుకు రైతులు వేచిచూస్తున్నారు.
రెట్టింపయిన ధరలు
గతేడాదితో పోల్చితే పచ్చిరొట్ట విత్తనాల ధరలు బాగా పెరిగాయి. జీలుగ కిలోకు రూ.142.50 ఉండగా.. అందులో రూ.71.25 సబ్సిడీ ఇచ్చారు. రైతు కిలోకు రూ.71.25 చెల్లించాల్సి వచ్చేది. ఈ ఏడాది కిలో 163.50కి పెంచారు. ఈ లెక్కన కిలోకు రూ.21 పెరిగింది. ఇది 30 కిలోల బస్తాపై ఏకంగా రూ.630 అదనపు భారం పడుతోంది. గతేడాది జనుము కిలోకు రూ.125.50 ఉండగా.. ఈ ఏడాది రూ.155.50కి పెంచారు. ఈ లెక్కన కిలోకు రూ.30 పెరిగి.. 40కిలోల బస్తాపై రూ.1200 అదనంగా చెల్లించాల్సి వస్తోంది. పెరిగిన రేట్ల ప్రకారం 30 కిలోల జీలుగ బస్తాకు రూ.2452.5, జనుము 40 కిలోల బస్తాకు రూ.3,110గా నిర్ణయించారు.


