కేంద్రం ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే సంజయ్‌కుమార్
జగిత్యాలఅగ్రికల్చర్: రైతులు ఇబ్బంది పడకుండా జగిత్యాల నియోజకవర్గంలో 105 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ తెలిపారు. చల్‌గల్ మార్కెట్ యార్డులో గురువారం కేంద్రాన్ని ప్రారంభించారు. రానున్న సీజన్ నుంచి సాగు సమాచారం అందించేందుకు గ్రామాల్లో రైతు ముంగిట్లోకి శాస్త్రవేత్తలు కార్యక్రమాన్ని తీసుకొస్తున్నట్లు తెలిపారు. వరి స్థానంలో ఆదాయం వచే పంటల వైపు దృష్టి సారించాలన్నారు. అదనపు కలెక్టర్ బీఎస్.లత, డీఏవో భాస్కర్, డీసీవో మనోజ్‌కుమార్, డీసీఎస్‌వో జితేందర్ రెడ్డి, డీఎంవో ప్రకాష్, మున్సిపల్ చైర్‌పర్సన్ సమిండ్ల వాణి, డీసీసీ అధ్యక్షుడు గాజెంగి నందయ్య, పీఏసీఎస్ చైర్మన్ నారాయణ రెడ్డి పాల్గొన్నారు.
సన్నాల సాగు పెంచాలి
జగిత్యాలఅగ్రికల్చర్: వచ్చే వానాకాలం సీజన్‌లో సన్నాల సాగు విస్తీర్ణం పెంచేలా చూడాలని అదనపు కలెక్టర్ బీఎస్.లత అన్నారు. సన్న వరి రకాలసాగు, యూరియా బుకింగ్ యాప్‌పై గురువారం ఫర్టిలైజర్, విత్తన డీలర్లకు జిల్లాకేంద్రంలో అవగాహన కల్పించారు. సన్నరకాలను సాగు చేస్తే మార్కెటింగ్‌లో ఇబ్బంది ఉండవన్నారు. సన్నాలకు క్వింటాల్‌కు రూ.500 బోనస్ ఇస్తున్న క్రమంలో సాగును ప్రోత్సహించాలని పేర్కొన్నారు. బీపీటీ–5204, జై శ్రీరాం, జేజీఎల్–1798, కేఎన్‌ఎం– 1638, హెచ్‌ఎంటీ సోనా, ఆర్‌ఎన్‌ఆర్– 15048 వంటి రకాలు పండించి ఆదాయం పొందాలని రైతులకు సూచించారు. డీఏవో భాస్కర్ మాట్లాడుతూ యూరియా బుకింగ్ యాప్ అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో రైతులు ఇంటి నుంచే ఫోన్ ద్వారా బుక్ చేసుకోవచ్చన్నారు. కార్యక్రమంలో జిల్లా ఉద్యానశాఖాధికారి లత, ఏడీ టెక్నికల్ రాజులునాయుడు, ఏడీ తిరుపతినాయక్ పాల్గొన్నారు.
కొండగట్టులో ఎమ్మెల్సీ వెంకట్ పూజలు
మల్యాల: కొండగట్టు శ్రీఆంజనేయస్వామి వారిని ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ దంపతులు గురువారం దర్శించుకున్నారు. వారికి అర్చకులు స్వాగతం పలికారు. పూజల అనంతరం స్వామివారి తీర్థ, ప్రసాదాలు అందించారు. ఈవో అంజనారెడ్డి, ప్రధాన అర్చకులు రామకృష్ణ, ఉప ప్రధాన అర్చకులు చిరంజీవ స్వామి, సూపరింటెండెంట్ ఉపాద్యాయుల చంద్రశేఖర్, తూము శ్రీనివాస్, ముత్యంపేట సర్పంచ్ దారం ఆదిరెడ్డి పాల్గొన్నారు. అనంతరం ఎమ్మెల్సీ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంతో కలిసి మానాలలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. కొత్తగా వివాహమైన వెంకట్ దంపతులకు సత్యంతోపాటు, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ శుభాకాంక్షలు తెలిపారు.
రేపు విజిలెన్స్ విచారణ
కోరుట్ల: కోరుట్ల మద్దుల చెరువులో గుర్రపు డెక్క తొలగింపు పనులను టెండర్లకు ముందే చేసిన వైనంపై శనివారం వరంగల్‌లో విజిలెన్స్ విచారణ చేపట్టనున్నట్లు సమాచారం. ఈ పనులపై మాజీ కౌన్సిలర్ ఇందూరి సత్యం నెల క్రితం డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్‌కు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. స్పందించిన డీఎంఏ శ్రీదేవి విజిలెన్స్ విచారణకు ఆదేశించారు. వరంగల్ ఆర్జేడీ కార్యాలయంలో విచారణ చేపట్టనున్నట్లు సమాచారం. విచారణకు మున్సిపల్ కమిషనర్, డీఈ హాజరుకావాలని వరంగల్ మున్సిపల్ రీజనల్ డైరెక్టర్ నుంచి ఆదేశాలు జారీ అయినట్లు తెలిసింది. పనులు ముగిసిన తరువాత టెండర్లు ఖరారు చేసిన తీరు వివాదాస్పదంగా మారిన విషయం తెలిసిందే.


