నేడు కో–ఆప్షన్‌ సభ్యుల ఎన్నిక | - | Sakshi
Sakshi News home page

నేడు కో–ఆప్షన్‌ సభ్యుల ఎన్నిక

Apr 24 2026 7:26 AM | Updated on Apr 24 2026 7:26 AM

మెట్‌పల్లి/జగిత్యాల: మెట్‌పల్లి మున్సిపల్‌ కో–ఆప్షన్‌ సభ్యుల ఎన్నిక శుక్రవారం నిర్వహించనున్నారు. ఇందుకు మధ్యాహ్నం 3.30గంటలకు మున్సిపల్‌ సమావేశ మందిరంలో కౌన్సిలర్లతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నలుగురు కో–ఆప్షన్‌ సభ్యులను ఎన్నుకోనున్నారు. మరోవైపు ఎన్నిక ప్రక్రియ నిబంధనల ప్రకారం చేపట్టడం లేదని 11వార్డుకు చెందిన ఓ వ్యక్తి హైకోర్టులో పిటిషన్‌ వేసినట్లు తెలిసింది. ఈ పిటిషన్‌పై 24న మధ్యాహ్నం విచారణ చేపట్టనున్నట్లు సమాచారం. ఈ క్రమంలో ఎన్నిక జరుగుతుందా..? లేక వాయిదా పడుతుందా..? అన్నది ఉత్కంఠగా మారింది.

కాంగ్రెస్‌ తప్పుదోవ పట్టించడం తగదు

– బీజేపీ మున్సిపల్‌ ఫ్లోర్‌ లీడర్‌ స్వరూప

కో–ఆప్షన్‌ ఎన్నిక ప్రక్రియలో కాంగ్రెస్‌ ప్రజలను తప్పుదోవ పట్టించేలా వ్యవహరించడం తగదని బీజేపీ మున్సిపల్‌ ఫ్లోర్‌ లీడర్‌ ధర్మపురి స్వరూప తెలిపారు. పార్టీ కౌన్సిలర్లతో కలిసి గురువారం విలేకరులతో మాట్లాడారు. కో–ఆప్షన్‌ ఎన్నిక చట్టబద్ధంగా నిర్వహిస్తున్నామని వైస్‌చైర్మన్‌ నవీన్‌ చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. కౌన్సిలర్లకు ఇచ్చిన ఎజెండా చట్టబద్ధంగా ఉంటే ఎందుకు వెనక్కి తీసుకోవాల్సి వచ్చిందో చెప్పాలని డిమాండ్‌ చేశారు. మున్సిపల్‌ నుంచి అధికారిక ఉత్తర్వును కమిషనర్‌ సంతకంతోనే జారీ చేయాల్సి ఉంటుందని, మెట్‌పల్లిలో కమిషనర్‌తో నిమిత్తం లేకుండా చైర్మన్‌ సంతకంతో నోటీసులు ఇవ్వడం ఎంతవరకు సమంజమని ప్రశ్నించారు. బొడ్ల రమేశ్‌, బొడ్ల ఆనంద్‌, దొనికెల శిరీష, అరిగెల అనూష, కోయల్కర్‌ స్రవంతి తదితరులున్నారు.

జగిత్యాలలో అవకాశం ఎవరికో..

జగిత్యాల మున్సిపాలిటీలో కో–ఆప్షన్‌ పదవులు దక్కించుకునేందుకు ఆశావహులు కొద్దిరోజులుగా తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఎమ్మెల్యే సంజయ్‌ సూచించిన వ్యక్తులకే పదవులు దక్కే అవకాశాలు న్నాయి. మున్సిపాలిటీలోని రెండు మైనార్టీ, రెండు జనరల్‌ పదవులున్నాయి. మొత్తం 11 మంది పోటీ పడుతున్నారు. వీరిలో ఎవరికి పదవి దక్కేనోనని చర్చ నడుస్తోంది. గట్టు సతీశ్‌, వీరబత్తిని పద్మజ, అబ్దుల్‌ ఖాదర్‌ (ముజ్జు), సుల్తానాకు పదవి దక్కే అవకాశాలున్నాయి. వీరిలో గట్టు సతీశ్‌ను ఎమ్మెల్యే ప్రతిపాదించగా.. పద్మజను మంత్రి అడ్లూరి సూచించినట్లు తెలిసింది. శుక్రవారం మున్సిపల్‌ సమావేశంలో సభ్యులను ఎన్నుకోనున్నారు.

నేడు సమావేశం

కో–ఆప్షన్‌ సభ్యుల ఎన్నికకు జగిత్యాల మున్సిపల్‌ కార్యాలయంలో సభ్యులు సమావేశం కానున్నారు. సభ్యులను ఎన్నుకున్న అనంతరం జనరల్‌బాడీ సమావేశం జరగనుంది. అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement