ప్రయాణికులకు ఆర్టీసీ కష్టాలు
కార్మికుల సమ్మెతో సగమే రోడ్డెక్కిన బస్సులు
11 డిపోల ఎదుట ధర్నా
పోలీస్ పహారాలో నడిచిన బస్సులు
విధుల్లో ప్రైవేట్ డ్రైవర్లు, కండక్టర్లు
కరీంనగర్ బైపాస్ వద్ద ఆర్టీసీ బస్సుకు ప్రమాదం, పలువురికి గాయాలు
కరీంనగర్ రీజియన్ పరిధిలో..
సాక్షిప్రతినిధి,కరీంనగర్/కరీంనగర్‌టౌన్: డిమాండ్ల సాధన కోసం ఆర్టీసీ కార్మికులు బుధవారం ఉదయం నుంచి మెరుపు సమ్మెకు దిగడం ఉమ్మడి జిల్లా రవాణా వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపింది. ఉమ్మడి జిల్లాలోని కరీంనగర్–1, కరీంనగర్–2, హుజూరాబాద్, సిరిసిల్ల, వేములవాడ, జగిత్యాల, కోరుట్ల, మెట్‌పల్లి, పెద్దపల్లి, మంథని, గోదావరిఖని మొత్తం 11 డిపోల్లోని ఉద్యోగులు సమ్మెకు దిగారు. ఉమ్మడి జిల్లాలో దాదాపు 3,057 మంది ఆర్టీసీ సిబ్బంది పనిచేస్తున్నారు. బుధవారం ఉదయం 99 శాతం మంది ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు సమ్మెలో పాల్గొన్నారు. కేవలం 40 మంది డ్రైవర్లు, కండక్టర్లు మాత్రం విధులకు హాజరు కాగా, మిగతా వారంతా సమ్మెలో పాల్గొన్నారు. అన్ని డిపోల వద్ద కార్మికులు నిరసనలకు దిగగా.. ముందు జాగ్రత్త చర్యగా తెల్లవారుజాముకు ముందే పోలీసు బలగాలు మోహరించారు. కరీంనగర్ రీజియన్‌లో దాదాపు 1,000 బస్సులు అందుబాటులో ఉండగా.. బుధవారం 401 బస్సులను హైదరాబాద్, వరంగల్, వేములవాడ, గోదావరిఖని, మెట్‌పల్లి, తదితర అన్ని రూట్లలో నడిపారు. 330 అద్దెబస్సులు, వాటి డ్రైవర్లు విధుల్లో పాల్గొన్నారు.
జగిత్యాల బస్టాండ్‌లో బస్సుల కోసం ఎదురుచూస్తున్న ప్రయాణికులు
ప్రయాణికుల ఇక్కట్లు
జిల్లాలో రైల్వే మార్గాలు అంతగా అభివృద్ధి చెందకపోవడంతో సింహభాగం ప్రజారవాణాకు ఆర్టీసీ మీదే ఆధారపడాలి. దీంతో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ప్రజారవాణా దాదాపుగా స్తంభించింది. ముఖ్యంగా మహిళా ప్రయాణికులు చాలా ఇబ్బందులు పడ్డారు. ప్రస్తుతం డిగ్రీ, ఓపెన్ టెన్త్, ఓపెన్ ఇంటర్ పరీక్షలు రాస్తున్న విద్యార్థులపై ఆర్టీసీ సమ్మె ప్రభావం పడింది. ఇక గ్రామీణ ప్రాంతాల్లో ఆటోడ్రైవర్లు, ట్యాక్సీలు ఽచార్జీలు అమాంతంగా పెంచారు. హైదరాబాద్, వరంగల్ రూట్లలోనూ ట్యాక్సీ డ్రైవర్లు చార్జీలు రూ.500 నుంచి రూ.800 వరకు ముక్కుపిండి మరీ వసూలు చేశారు. మరోవైపు కార్‌పూలింగ్, కార్ షేరింగ్ యాప్‌లకు డిమాండ్ పెరిగింది. వరంగల్ వెళ్తున్న ఆర్టీసీ బస్సుకు కరీంనగర్ బైపాస్ వద్ద ప్రమాదం జరగడంతో పలువురు ప్రయాణికులు గాయపడ్డారు. అనుభవం లేని ప్రైవేటు డ్రైవర్‌కు బస్సులు ఇవ్వడం వల్లే ప్రమాదం జరిగింది ఆర్టీసీ ఐకాస నాయకులు ఆరోపించారు.
డిపోలు 11
ఆర్టీసీ బస్సులు 550
అద్దె బస్సులు 330
ఎలక్ట్రికల్ బస్సులు 100
ఆర్టీసీ డ్రైవర్లు 984
ఆర్టీసీ కండక్టర్లు 1,354
ఇతర సిబ్బంది 719 (ఆఫీసు, డిపో,వర్క్‌షాపులు కలిపి)


