జగిత్యాల: అటు ఆహార భద్రత శాఖ అధికారుల పర్యవేక్షణ, ఇటు మున్సిపల్ అధికారులు పట్టించుకోకపోవడంతో హోటళ్లు, రెస్టారెంట్లు, టిఫిన్ సెంటర్లలో పరిశుభ్రతతోపాటు, నాణ్యత లోపిస్తోంది. కనీసం అధికారులు తనిఖీలు చేయకపోవడంతో ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. హోటళ్లలో, రోడ్డుపక్కన ఉండే చిన్నచిన్న హోటళ్లలో అపరిశుభ్రత లోపిస్తోంది. హోటళ్ల పక్కనే మురికికాలువలు ఉండటం, ఆ సమీపంలోనే వంటపాత్రలు కడగడం, రోడ్లపై వచ్చే దుమ్ముతో పేరుకుపోతోంది. అయినా అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. రెస్టారెంట్లలో అపరిశుభ్రత వంటగదులు, మురికినీటితో వంటపాత్రలు శుభ్రం చేయడం, దుర్వాసన వచ్చే గ్లాసులు, ఇలా ప్రతి హోటల్‌లో దర్శనం ఇస్తున్నాయి. జిల్లాలో ప్రతి హోటల్‌లో మాస్టర్లు, సర్వర్లు, పనిచేసే వారు ఆఫ్రాన్లు, గ్లౌసులు మచ్చుకు కూడా కన్పించవు. ఆహారంలో వెంట్రుకలు రావడం, ఇతరత్రా పదార్థాలు రావడంతో పాటు చట్నీ దుర్వాసన రావడం మామూలుగా మారింది. రోజులకు తరబడిన వినియోగించిన నూనెలను మళ్లీమళ్లీ వాడినా పరిపాటిగా మారింది. కోళ్ల వ్యర్థాలు, కళేబరాలు, ఎముకలతో తయారుచేసిన నూనె విక్రయిస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
తనిఖీలు లేకనే..
జిల్లా కేంద్రంలో హోటళ్లు, రెస్టారెంట్లలో టిఫిన్ సెంటర్లలో అధికారులు నిత్యం తనిఖీ చేయకపోవడంతో వారు ఆడిందే ఆటగా మారింది. గతంలో తనిఖీ చేసే సమయంలో కుళ్లిన చికెన్, మటన్ ఇతరత్రా పదార్థాలు లభ్యమైతే అప్పటివరకు కేసులు నమోదు చేసి చేతులు దులుపుకున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఇటీవలే కొత్తబస్టాండ్‌లోని ఓ హోటల్‌లో చట్నీలో గడ్డిపురుగు రాగా, గతంలో మూడు మాసాల క్రితం తహసీల్ చౌరస్తాలో ఉన్న ఓ హోటల్‌లో ఇడ్లీలో బొద్దింక, చపాతిలో ఫంగస్, ఇడ్లీలో జెర్రీ వచ్చిన సంఘటనలు చోటుచేసుకోగా బాధితుల ఫిర్యాదు మేరకు వచ్చి నామమాత్రంగా సీజ్ చేశారు. మరుసటి రోజు నుంచే ఆ హోటల్ ప్రారంభమైంది.
నిబంధనలు గాలికే...
నిబంధనల ప్రకారం ఏ రోజు పదార్థాలను ఆ రోజే విక్రయించాలి. ఒకసారి వినియోగించిన నూనెను మరోసారి వాడరాదు. అయినప్పటికీ రోజుల తరబడి అదే నూనెను వాడుతున్నారు. ముఖ్యంగా భోజనాలు, టిఫిన్లు తయారుచేసే ప్రాంతాల్లో వంటగదులు శుభ్రంగా ఉండాలి. కానీ హోటళ్లలో ఒక వైపు ఎలుకలు, మరో వైపు బల్లులు, జెర్రీలు, బొద్దింకలు, పందికొక్కులు సంచరిస్తున్నా పక్కనే పెద్దపెద్ద మురికికాలువల దుర్గందం వెదజల్లుతున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యారు. ఒకవేళ హోటళ్లలో మిగిలిన ఆహారం, చట్నీలను ఫ్రిజ్‌లో నిల్వ ఉంచి మళ్లీ తెల్లవారు దానినే వడ్డిస్తున్నారు. దీంతో అవి తిన్న బాధితులకు ఫుడ్ పాయిజన్ సైతం జరుగుతుంది. ఫిర్యాదు చేస్తే తప్ప తనిఖీలు చేయకపోవడం పరిపాటిగా మారింది.
ఫోన్లు ఎత్తని అధికారులు
హోటళ్లు, రెస్టారెంట్లలో ఏదైనా సమస్య ఎదురైతే ఫుడ్‌సేఫ్టీ అధికారులకు ఫోన్ చేసి తెలపాలన్నా అందుబాటులో ఉండటం లేదని ప్రజలు వాపోతున్నారు. జగిత్యాలలో సంబంధిత అధికారి కనీసం ఫోన్ కూడా లిఫ్ట్ చేయడం లేదని ప్రజల నుంచి ఆరోపణలు వస్తున్నాయి. ఎవరైనా ఫిర్యాదు చేయాలనుకుంటే ఎక్కడ ఫిర్యాదు చేయాలో తెలియని పరిస్థితి నెలకొంది.
అది జిల్లా కేంద్రంలోని కొత్తబస్టాండ్ సమీపంలోగల ఓ పూరీ సెంటర్. అందులో టిఫిన్ చేసేందుకు ఓ వినియోగదారుడు వచ్చాడు. టిఫిన్ చేస్తుండగా.. చట్నీలో పెద్ద గడ్డిపురుగు వచ్చింది. సదరు వ్యక్తి గమనించడంతో ప్రమాదం తప్పింది. ఆ చట్నీ తింటే అనారోగ్యం పాలయ్యేవాడు. విషయాన్ని అధికారులకు తెలిపినా పట్టించుకోలేదని పేర్కొన్నారు. ఈ సమస్య ఆ వినియోగదారుడిదే కాదు.. చాలామందిది. అటు ఆహారభద్రత అధికారులు, ఇటు మున్సిపల్ అధికారులు పట్టించుకోకపోవడంతో ప్రతి హోటల్‌లో నాణ్యత, శుభ్రత కొరతవడుతోంది. నామమాత్రంగా అధికారులు తనిఖీలు చేస్తూ చేతులు దులుపుకుంటున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
మామూళ్లతో సరే..
జిల్లా కేంద్రంలో అధికారులు తనిఖీలు చేపట్టగా శుభ్రత లేకపోవడం, ఆహార పదార్థాల్లో నాణ్యత పాటించడం లేదని తనిఖీల్లో వెల్లడి అవుతున్నా ఏదో నామమాత్రపు కేసులు పెడుతూ జరిమానా విధిస్తూ మామూళ్లతో సరిపెట్టుకుంటున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఆహార కల్తీని నిరోధించేందుకు ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నప్పటికీ ఆశించిన మేరకు ఫలితాలు ఇవ్వడం లేదు.


