మల్లాపూర్: తనకు తెలియకుండానే తన భూమిని విరాసత్ చేశారని, అధికారులు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ.. 72 ఏళ్ల వృద్ధుడు కుటుంబంతో సహా తహసీల్దార్ కార్యాలయం ఎదుట మంగళవారం ఆమరణ దీక్షకు దిగాడు. ఈ ఘటన జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలకేంద్రంలో చోటుచేసుకుంది. బాధితుని కథనం ప్రకారం మల్లాపూర్‌లోని మొగిలిపేటకు చెందిన మంగాళరపు గంగారాంకు భార్య గంగు, కుమారుడు ధర్మరాజు, కూతురు బీమ రాజు ఉన్నారు. ఇద్దరికీ వివాహమైంది. గంగారాంకు సంగెంశ్రీరాంపూర్ శివారులో 82/1 సర్వేనంబర్‌లో 1.27 ఎకరాల భూమి ఉంది. కుమారుడితో కలిసి సాగు చేసుకుంటున్నాడు. ఆ భూమిపై బ్యాంక్‌లో పంట రుణం తీసుకుని ఏటా రెన్యూవల్ చేస్తున్నాడు. 2025 జనవరిలో లోన్ రెన్యూవల్ కోసం వెళ్లగా.. తన భూమి ఇతరులకు విరాసత్ పట్టా అయిందని బ్యాంక్ అధికారులు తెలపడంతో కంగుతిన్నాడు. రెవెన్యూ అధికారులను నిలదీశాడు. ఒబులాపూర్‌కు చెందిన గాండ్ల రాజేశ్వరి పేరిట విరాసత్ అయినట్లు తెలుసుకుని ఆగ్రహం వ్యక్తంచేశాడు. తాను బతికి ఉండగానే తన భూమిని ఇతరులకు విరాసత్ చేశారని తహశీల్దార్, ఆర్డీవో, కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు. ఆ భూమిని తామే సాగు చేసుకుంటున్నామని చెబుతున్నా అధికారులు కనికరించడం లేదు. గత్యంతరం లేక కుటుంబంతోపాటు ఆమరణ దీక్షకు దిగినట్లు బాధితుడు పేర్కొన్నారు. తాను బతికి ఉండగానే మరణించినట్లు ధ్రువీకరణ పత్రం ఇచ్చిన పంచాయతీ కార్యదర్శి.. ఎలాంటి విచారణ చేయకుండానే వారసత్వ పట్టా చేసిన రెవెన్యూ అధికారులపై చర్యలు తీసుకుని తనకు న్యాయం చేయాలని వేడుకున్నాడు. ఆందోళన విషయం తెలుసుకున్న తహసీల్దార్ రాంచందర్, ఎస్సై అనిల్ రెవెన్యూ, పోలీసు సిబ్బందితో కలిసి వచ్చి వృద్ధుడితో మాట్లాడారు. పట్టా రద్దు కోసం ఆర్డీవోకు దరఖాస్తు చేసుకుంటే విచారణ జరిపి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో దీక్ష విరమించుకున్నారు.
బతికుండగానే ఎకరం భూమి ఇతరులకు విరాసత్
తన భూమి తనకు పట్టా చేయాలని ఆమరణ దీక్ష


