కరీంనగర్ కార్పొరేషన్: సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఎందుకు పోవాలో బీఆర్‌ఎస్ చెప్పాలని రాష్ట్ర సంక్షేమశాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ డిమాండ్ చేశారు. కేసీఆర్ చావును ఎవరూ కోరుకోలేదన్నారు. కాళేశ్వరంపై సీబీఐ విచారణ జరిపేలా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ చూడాలన్నారు. మంగళవారం నగరంలోని ఆర్‌అండ్‌బీ అతిథిగృహంలో మాట్లాడారు. రేవంత్ ప్రభుత్వం పోవాలంటూ బీఆర్‌ఎస్ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలపై మండిపడ్డారు. తన చావు కోరుకున్నారంటూ జగిత్యాల సభలో కేసీఆర్ అనడాన్ని ఖండించారు. ప్రతిపక్షనాయకుడిగా ఆయన్ను గౌరవించామన్నారు. సీఎం రేవంత్‌ను బీఆర్‌ఎస్ నాయకులు ఏకవచనంతో మాట్లాడుతూ అవమానిస్తున్నారన్నారు. తమ ప్రతి పక్షనాయకులు అప్పటి సీఎం కేసీఆర్‌ను ఏనాడూ ఏకవచనంతో సంబోధించలేదన్నారు. సీఎంగా ఉన్నప్పుడు కేసీఆర్ మంత్రులతో కూడా మాట్లాడలేదని, రేవంత్ అందరి సలహాలు, సూచనలు తీసుకుంటున్నారన్నారు. 2023లో చివరి రైతుబంధు వేసేందుకు కేసీఆర్ ఔటర్‌రింగ్‌రోడ్డును అగ్గువకు కుదవపెట్టారని ఆరోపించారు. బీఆర్‌ఎస్ అధికారంలో ఉన్న సమయంలో చేసిన అప్పులకు ప్రతినెల రూ. 6వేల కోట్లు వడ్డీలు చెల్లిస్తున్నామని అన్నారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలో ఉన్నప్పటికీ సంక్షేమ పథకాలను కొనసాగిస్తున్నామన్నారు. ఎఫ్‌సీఐ గోదామల్లో పేరుకుపోయిన బియ్యం నిల్వలను కేంద్రంతో మాట్లాడి తరలించే ప్రక్రియను కేంద్ర మంత్రి బండి సంజయ్ తీసుకోవాలన్నారు. కాళేశ్వరం కేసు సీబీఐకి అప్పగిస్తే కేంద్రం స్పందించడం లేదని, కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో మాట్లాడి సీబీఐ విచారణ జరిపించేలా బండి సంజయ్ చూడాలన్నారు. జీవన్‌రెడ్డి పార్టీ మారడం వల్ల లాభమా, నష్టమా ప్రజలు నిర్ణయిస్తారన్నారు. త్వరలో జగిత్యాలలో సీఎం సభ నిర్వహిస్తామని తెలిపారు. డీసీసీ అధ్యక్షుడు, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి, అర్బన్ బ్యాంక్ చైర్మన్ కర్ర రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
కేసీఆర్ చావును ఎవరు కోరుకోలేదు
కాళేశ్వరంపై సీబీఐ విచారణ జరిగేలా బండి సంజయ్ చూడాలి
మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్


