మల్యాల: అంజన్న స్వామి ఆలయానికి మెట్లమీదుగా వెళ్లే దారి అస్తవ్యస్తంగా మారింది. బండరాళ్లు.. పైపుల లీకేజీతో బురదను తలపిస్తోంది. కాలినడకన మెట్లదారి వెంట వెళ్లి స్వామివారికి మొక్కులు చెల్లించుకోవడం భక్తులకు గగనంగా మారుతోంది. దీనికితోడు మలమూత్రాలతో దుర్గంధం వెదజల్లుతోంది. దారి వెంట ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని, హనుమాన్ పెద్ద జయంతి నాటికి శుద్ధి చేసి, మధ్యమధ్య ఉన్న బండరాళ్లు తొలగించాలని భక్తులు కోరుతున్నారు. కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయానికి నిత్యం వేలాదిమంది భక్తులు వస్తుంటారు. మంగళవారం, శనివారాల్లో రద్దీ అధికం. వివిధ ప్రాంతాల నుంచి వేల సంఖ్యల్లో తరలివస్తుంటారు. ఏటేటా భక్తుల సంఖ్య పెరుగుతున్నప్పటికీ ఆ మేరకు సౌకర్యాలు కల్పించడం లేదని భక్తులు ఆరోపిస్తున్నారు.
రోడ్డంతా అస్తవ్యస్తం
కొండగట్టు ఆంజనేయస్వామి సన్నిధికి కాలినడకన చేరుకునే దారి అస్తవ్యస్తంగా మారడంతో భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. మధ్యలో బండరాళ్లు ఉండడంతోపాటు పైపులైను లీకేజీతో దారిమొత్తం బురదమయం అవుతోంది. పిచ్చిమొక్కలు ఏపుగా పెరగడంతో నడిచివెళ్లేందుకు భక్తులు ఇబ్బందులు పడుతున్నారు.
కొండగట్టు ఆంజనేయస్వామిని దర్శించుకునేందుకు మెట్లదారి వెంట నడిచి వెళ్లే భక్తులు బండరాళ్లు, బురదనీటితో ఇబ్బంది పడుతున్నారు. జయంతి ఉత్సవాల్లో వేలాదిమంది ఈ దారిమీదుగానే స్వామి సన్నిధికి చేరుకుంటారు. అధికారులు మెట్లదారిని అభివృద్ధి చేయాలి.
– సంకూర్తి తిరుపతి, మద్దుట్ల సర్పంచ్
మెట్లదారి వెంట ఆంజనేయస్వామి వారి సన్నిధికి వచ్చే భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపడుతాం. భక్తుల మొక్కులు సజావుగా చెల్లించుకునేలా అభివృద్ధి చేసేందుకు దృష్టి సారిస్తాం. వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా చూస్తాం.
– అంజనా రెడ్డి, ఆలయ ఈవో


