మల్యాల: కొండగట్టు శ్రీఆంజనేయస్వామి ఆలయంలో మే 11 నుంచి 13 వరకు జరిగే హనుమాన్ పెద్ద జయంతి ఉత్సవాల ఏర్పాట్లను ఆలయ ఈఓ అంజనా రెడ్డి సోమవారం పరిశీలించారు. ఆలయ పరిసరాల్లో పర్యటించి, భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు. భక్తులకు తాగునీటి వసతి, క్యూలైన్ల ఏర్పాటు, పారిశుధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టిసారించాలని సూచించారు. కార్యక్రమంలో ఆలయ అర్చకులు కపీందర్, లక్ష్మణప్రసాద్, సూపరింటెండెంట్ సునీల్‌కుమార్ పాల్గొన్నారు.
వీరబ్రహ్మేంద్రస్వామి కల్యాణం
మెట్‌పల్లిరూరల్: మెట్‌పల్లి మండలం జగ్గాసాగర్‌లో శ్రీవీరబ్రహ్మేంద్రస్వామి ఆలయ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఉత్సవాల్లో భాగంగా సోమవారం గోవిందమాంబ సమేత శ్రీవీరబ్రహ్మేంద్రస్వామి కల్యాణం జరిపించారు. ప్రత్యేక పూజలు, యాగాలు చేశారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కల్యాణాన్ని తిలకించారు. అన్నప్రసాద వితరణ చేశారు. కార్యక్రమంలో విశ్వబ్రాహ్మణ సంఘ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి
రాయికల్: విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని జెడ్పీ సీఈవో గౌతంరెడ్డి సూచించారు. మండలంలోని అల్లీపూర్ జ్యోతిబాపూలే పాఠశాలను సోమవారం సందర్శించారు. మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. ఆయన వెంట ప్రిన్సిపాల్ స్వప్నకుమారి, ఎంపీడీవో చిరంజీవి, ఇన్‌చార్జి సెక్రెటరీ శ్రీహరి, 8వ వార్డు మెంబర్ అనుమల్ల రాజ్‌కుమార్ పాల్గొన్నారు.


