రైతులు సద్వినియోగం చేసుకోవాలి
కరీంనగర్ అర్బన్: మూస ధోరణిలో పంటల సాగు కాకుండా ప్రజారోగ్యం, అవసరాల క్రమంలో సాగును ప్రోత్సహించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఒకప్పుడు పత్తి, వరి తక్కువ విస్తీర్ణంలో సాగయ్యేది. మొక్కజొన్న, రాగులు, సజ్జలు, జొన్నలు, అవిసెలు, ఉలవలు, పెసర, కంది, మినుములు, శనగ వంటి పంటలకు ప్రాధాన్యతనిచ్చేవారు. కాలక్రమేణా పత్తి, వరి సాగే సింహభాగం కాగా ఇతర పంటలు కనుమరుగయ్యాయి. ఇక కూరగాయల సాగు అంతంతమాత్రమే. ఇతర రాష్ట్రాలు, జిల్లాలపై ఆధారపడాల్సిన దుస్థితి. దీంతో రవాణా ఖర్చులు, ఏజెంట్ కమీషన్ తదితర కారణాలతో వాటి ధరలు ఆకాశన్నంటుతున్నాయి. సదరు సమస్యకు పరిష్కారంగా కూరగాయలను పెద్దఎత్తున పండించాలని రాష్ట్ర ఉద్యానశాఖ నిర్ణయించింది. ఈ క్రమంలో కరీంనగర్ జిల్లాలోని వ్యవసాయ సహకార పరపతి సంఘాల ఆధ్వర్యంలో పలువురు రైతులను గుర్తించి వలంటీర్లుగా శిక్షణనిస్తోంది.
30 ప్యాక్స్‌లు.. 30మంది వలంటీర్లు
పీఏసీఎస్‌కు ఒకరి చొప్పున వలంటీర్లను ఎంపిక చేయగా ఇప్పటికే రాజేంద్రనగర్‌లోని ఆచార్య జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఽఆధ్వర్యంలో శిక్షణనిచ్చారు. ఈ నెల 18న జిల్లా ఉద్యానశాఖ కార్యాలయంలో మలిదశ శిక్షణనిచ్చారు. కరీంనగర్ జిల్లాలోని 30 ప్యాక్స్‌లకు 30 మంది వలంటీర్లను ఎంపిక చేశారు. వారంతా తాము నేర్చుకున్న మెలకువలను రైతులకు వివరించి కూరగాయల రైతులను చైతన్యవంతులను చేయనుండగా బాసటగా నిలువనున్నారు.
ఒక్కో వలంటీరు.. వంద ఎకరాలు
ఒక్కో వలంటీరు వంద ఎకరాల చొప్పున కూరగాయల పంటలు సాగు చేయించాలని లక్ష్యంగా నిర్దేశించారు. సదరు లెక్కన 300 ఎకరాలలో కూరగాయలు పండించేలా కృషి చేయనున్నారు. విస్తీర్ణం పెరుగనుంది. తద్వారా విస్తీర్ణం మరింత పెరగనుందన్నది ప్రభుత్వ భావన. ఉచితంగా నారు ఇవ్వనుండగా టమాట, వంకాయ, మిర్చి వంటి వాటిని గరిష్టంగా 5ఎకరాల వరకు ఇవ్వనున్నారు. 50శాతం రాయితీతో ప్లాస్టిక్ మల్చింగ్ ఎకరానికి రూ.8వేల చొప్పున గరిష్టంగా 5 ఎకరాల వరకు ఇవ్వనుండగా 50శాతం రాయితీతో యూనిట్(అర్ధ ఎకరం)కు రూ.50వేల చొప్పున ఇవ్వనున్నారు. శాశ్వత పందిళ్లు వేసుకోలేని వారికి కట్టెలతో స్టేకింగ్ కోసం 50శాతం రాయితీతో ఎకరానికి రూ.4వేలు, నీరుపారుదలకు డ్రిప్ లేదా స్ప్రింక్లర్ రాయితీపై ఇస్తారు. ఇక సాగుకు కావాల్సిన స్ప్రేయర్లు, బ్రష్ కట్టర్‌లు, పవర్ వీడర్‌లు తదితర వాటిని 40–50శాతం రాయితీతో ఇవ్వనున్నారు. వర్మీకంపోస్ట్ తయారీకి 50శాతం రాయితీ, పండిన పంటను ప్యాక్ చేయడం, మిగిలిన వాటిని ఉంచడం కోసం ప్యాక్ హౌస్ 50శాతం రాయితీ, అంతేకాకుండా సోలార్ డ్రయర్, పాలీహౌస్, షెడ్‌నెట్, ఫామ్‌పాండ్స్ వంటి వాటిని రాయితీపై ఇవ్వనున్నారు.
మూడు చోట్ల విత్తనోత్పత్తి
వ్యవసాయశాఖ, నాబార్డు, వ్యవసాయ విశ్వవిద్యాలయం సమన్వయంతో జిల్లాలోని మూడు సహకార సంఘాల పరిధిలో విత్తనోత్పత్తి చేయనున్నారు. వరితో పాటు పెసర, కంది పంటలు సాగు చేయాలని నిర్ణయించారు. జిల్లాలో గట్టుదుద్దెనపల్లి, ఊటూరు, జమ్మికుంట ప్రాంతాల్లో ఒక్కో సంఘం పరిధిలో 10ఎకరాలు సాగు చేయాలని నిర్ణయించారు. ఆదర్శ రైతులను ఎంపిక చేసి వారి ద్వారా సాగు చేయించనున్నారు.
ప్రభుత్వమిచ్చే రాయితీని వినియోగించుకుని రైతులు కూరగాయల సాగు చేసుకోవాలి. ప్రభుత్వమిచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. రైతులే విక్రయించుకునేలా గిట్టుబాటు ధర లభించేలా మార్కెట్ సౌకర్యం ఉంటుంది.
– పల్లె కమలాకర్‌రెడ్డి,
జిల్లా ఉద్యాన, పట్టుపరిశ్రమ అధికారి
సహకార సంఘాల పరిధిలో వలంటీర్ల నియామకం
30 ప్యాక్స్‌లలో 300 ఎకరాల్లో సాగుకు రైతుల ఎంపిక
సాగుకు ప్రభుత్వ రాయితీ, ప్రోత్సాహం


