హార్వెస్టర్‌ బావిలో పడి డ్రైవర్‌ దుర్మరణం | - | Sakshi
Sakshi News home page

హార్వెస్టర్‌ బావిలో పడి డ్రైవర్‌ దుర్మరణం

Apr 20 2026 8:29 AM | Updated on Apr 20 2026 8:29 AM

పెగడపల్లి: పొలం కోస్తుండగా ప్రమాదవశాత్తు హార్వెస్టర్‌తోపాటు వ్యవసాయ బావిలో పడి డ్రైవర్‌ దుర్మరణం చెందిన ఘటన మండలంలోని నందగిరిలో ఆదివారం విషాదం నింపింది. పోలీసులు, గ్రామస్తుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన పాలకాల లింగయ్య, నర్సవ్వ దంపతులకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కూతుళ్లు. కూతుళ్లకు వివాహమైంది. లింగయ్య జీవనోపాధి కోసం విదేశాలకు వెళ్లాడు. నర్సవ్వ బీడీకార్మికురాలు. పెద్ద కుమారుడైన మధు (35) డైవర్‌గా పని చేస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు. గ్రామానికి చెందిన దనాల పర్శరాం అనే యజమానికి హార్వెస్టర్‌ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఓ రైతు వరిపంటను కోసేందుకు వెళ్లిన మధు ప్రమాదవశాత్తు హార్వెస్టర్‌తో పాటు వ్యవసాయ బావిలో పడిపోయాడు. ఈ ఘటనలో మధు అక్కడిక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న ఎస్సై కిరణ్‌కుమార్‌ ప్రమాదస్థలికి చేరుకుని క్రేన్‌ సహాయంతో హార్వెస్టర్‌ను బయటకు తీయించి, గజ ఈతగాళ్ల సహాయంతో మధు మృతదేహాన్ని వెలికితీశారు. మృతదేహాన్ని చూసి కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. మధుకు భార్య, ఇద్దరు కుమారులున్నారు. భార్య కావ్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

అన్ని విధాలా ఆదుకుంటాం: మంత్రి అడ్లూరి

డ్రైవర్‌ మధు కుటుంబాన్ని ఆదుకుంటామని మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ అన్నారు. ప్రమాదస్థలికి చేరుకున్న ఆయన మృతుని కుటుంబసభ్యులను ఓదార్చారు. ఇందిరమ్మ ఇంటితోపాటు కావ్యకు విద్యార్థత ఆధారంగా అంగన్‌వాడికేంద్రంలో హెల్పర్‌, లేదా మధ్యాహ్న భోజనం కేర్‌టేకర్‌, ఔట్‌సోర్స్‌ ఉద్యోగావకాశం కల్పిస్తామని భరోసానిచ్చారు. మంత్రి వెంట ఏఎంసీ చైర్మన్‌ రాములుగౌడ్‌, సర్పంచ్‌ రజిత ఉన్నారు.

నందగిరిలో విషాదం

Advertisement
 
Advertisement
Advertisement