ఆదా ఏదయా..! | - | Sakshi
Sakshi News home page

ఆదా ఏదయా..!

Apr 20 2026 8:11 AM | Updated on Apr 20 2026 8:11 AM

సాయంత్రం ఆరు గంటలకే విద్యుదీపాల వెలుగులు ఉదయం 6 గంటల దాకా కొనసాగింపు వేసవిలో ఆదాపై కనిపించని చర్యలు విద్యుత్‌ బిల్లు నెలకు రూ.లక్ష గండి

కోరుట్ల: తొమ్మిది నెలల క్రితం పట్టణంలోని దెబ్బతిన్న రోడ్లకు టెండర్‌ పిలవకుండా అర్ధరాత్రి..అపరాత్రి తేడా లేకుండా పారిశుధ్య కార్మికులతో రిపేర్‌ చేయించి మున్సిపల్‌ డబ్బులు ఆదా చేస్తున్నామని చెప్పిన అఽధికారులు.. వీధి దీపాలకు విద్యుత్‌ సరాఫరాలో ఆ అంశాన్ని ఎందుకు విస్మరిస్తున్నారో అంతుచిక్కడం లేదు. వేసవిలో చిన్నపాటి ఆదా అంశం నెలకు రూ.లక్ష ఖర్చు తగ్గిస్తుందనడంలో సందేహం లేదు. అసలే జనరల్‌ ఫండ్‌ అరకొరగా ఉన్న సమయంలో మున్సిపల్‌ అధికారులు విద్యుత్‌ ఆదా విషయంలో నిర్లక్ష్యం ప్రదర్శించడంపై విమర్శలు వస్తున్నాయి.

3 గంటలు ఆదా చేయచ్చు

మున్సిపల్‌ అధికారులు చేస్తున్న పనిపై కాస్త నిబద్ధత చూపితే వేసవిలో ప్రతిరోజూ మూడు గంటల పాటు విద్యుత్‌ను ఆదా చేయొచ్చు. సాధారణంగా వేసవిలో సాయంత్రం 7.30 గంటల వరకు పొద్దుగూకడం లేదు. అదేవిధంగా ఉదయం 5 గంటలకే తెల్లవారుతుంది. మున్సిపల్‌ అధికారులు మాత్రం సాయంత్రం 5.30 గంటలకే వీధి దీపాలు ఆన్‌ చేస్తున్నారు. ఉదయం 6.30 గంటల వరకూ కొనసాగిస్తున్నారు. ఈ లెక్కన ప్రతిరోజూ ఎంత లేదన్నా సుమారు మూడు గంటలపాటు అవసరం లేకున్నా విద్యుత్‌ను వృథా చేస్తున్నారు. ఈ విషయంలో మున్సిపల్‌ అధికారులు కింది స్థాయి సిబ్బందికి సరైన సూచనలు ఇవ్వడంలో విఫలమవుతున్నారు. అధికారులే ముందు జాగ్రత్తతో ఆదాపై దృష్టి సారించాల్సి ఉండగా.. వేసవిలో సాయంత్రం తొందరగా విద్యుత్‌ దీపాలు వేసి కరెంటు చార్జీలు వృథా చేస్తున్నారని జనం విమర్శించే వరకు ఎలాంటి పట్టింపు లేని ధోరణితో వ్యవహరించడం గమనార్హం.

నెలకు రూ.లక్ష ఆదా..

కోరుట్ల మున్సిపాలిటీలోని 33 వార్డుల్లో సుమారు 6,200 విద్యుత్‌ దీపాలు ఉన్నాయి. వీటికి తోడు 42 కూడళ్లలో హైమాస్ట్‌ లైట్లు ఉన్నాయి. వీటన్నింటికి కలిపి ప్రతినెలా సగటున రూ.9 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు కరెంటు బిల్లు వస్తోంది. మున్సిపాలిటీలో సిబ్బంది జీతాలు మినహాయిస్తే అధిక మొత్తంలో ఖర్చు చేసేది విద్యుత్‌చార్జీలకే అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో వేసవి కాలం సుమారు నాలుగు నెలలు గడిచేదాకా విద్యుత్‌ దీపాలు ఆన్‌ ఆఫ్‌ చేయడంలో కొద్దిపాటి ఏమరుపాటుతో వ్యవహరిస్తే ప్రతినెలా రూ.లక్ష వరకు విద్యుత్‌ బిల్లులు తగ్గే అవకాశం ఉంది. ఈ విషయాన్ని పట్టించుకోకుండా దుబారాగా విద్యుత్‌ వినియోగం చేస్తే మున్సిపల్‌ ఖజానాకు అనవసరంగా గండి పడుతుంది. మున్సిపల్‌ అధికార యంత్రాంగం అవసరమైన చర్యలు తీసుకుంటే విద్యుత్‌ చార్జీలను ఆదా చేయచ్చన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement