జగిత్యాలటౌన్: ఆర్టీసీలో కార్మిక సంఘాలను పునరుద్ధరించి కార్మికుల ఆత్మగౌరవాన్ని కాపాడతానంటూ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీ అమలు చేయాలని, లేకుంటే సమ్మెకు వెళ్తామని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ శంకర్‌రెడ్డి హెచ్చరించారు. సమస్యల పరిష్కారం కోరుతూ ఆదివారం ఉదయం జగిత్యాల డిపో ఎదుట గేట్ ధర్నా నిర్వహించారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలన్నారు. కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలన్నారు. పెండింగులో ఉన్న పీఆర్సీ బకాయిలు విడుదల చేయాలని, సిబ్బందిపై పనిభారం తగ్గించి, పనివేళలు క్రమబద్ధీకరించాలని, ఎలక్ట్రిక్ బస్సుల పేరిట ఆర్టీసీ ప్రైవేటీకరణను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఈనెల 21 అర్ధరాత్రి నుంచి సమ్మెకు వెళ్తామని హెచ్చరించారు. నాయకులు రామయ్య, రజిత, రమేశ్‌రావు, ఫ్రాన్సిస్, కార్మికులు పాల్గొన్నారు.


