కేసీఆర్‌ సభను అడ్డుకునేందుకు కుట్ర | - | Sakshi
Sakshi News home page

కేసీఆర్‌ సభను అడ్డుకునేందుకు కుట్ర

Apr 19 2026 7:47 AM | Updated on Apr 19 2026 7:47 AM

● సభ ఏర్పాట్లను పరిశీలించిన కేటీఆర్‌, హరీశ్‌రావు

జగిత్యాల: ఈనెల 20న జగిత్యాలలో నిర్వహించనున్న బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ప్రజా ఆశీర్వాద సభ ప్రాంగణాన్ని పార్టీ సీనియర్‌ నేతలతో కలిసి కేటీఆర్‌, హరీశ్‌రావు పరిశీలించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. కేసీఆర్‌ సభ ఏర్పాటుతో జగిత్యాలలో పండుగ వాతావరణం ఏర్పడిందని, జగిత్యాల నుంచే బీఆర్‌ఎస్‌ జైత్రయాత్ర ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. ప్రభుత్వం, కాంగ్రెస్‌ నాయకులు సభను అడ్డుకునేందుకు అనేక కుట్రలు పన్నుతున్నారని, జాతీయ రహదారులు కూడా తవ్వారని ఆరోపించారు. ఎన్ని కుట్రలు చేసినా ముందుకెళ్తామన్నారు. సభ నిర్వహణకు ఏర్పాట్లు పూర్తయ్యాయని, ప్రజలకు ఇబ్బంది కలగకుండా మూడు లక్షల వాటర్‌బాటిళ్లు తెప్పిస్తున్నామని వివరించారు. ప్రతి నియోజకవర్గానికి ఒకరికి బాధ్యతలు ఇచ్చామని, ఎండల తీవ్రను దృష్టిలో పెట్టుకుని అన్ని ఏర్పాట్లు చేశామని వివరించారు. సాయంత్రం 5.30 గంటలకు మాజీ సీఎం కేసీఆర్‌ సభ ప్రాంగణానికి చేరుకుంటారని, ఎండ చల్లబడిన తర్వాత సభ ప్రారంభమవుతుందని వెల్లడించారు.

కేసీఆర్‌ మాటల కోసం ఎదురుచూపు

కేసీఆర్‌ ఏం మాట్లాడబోతున్నారని రైతులు, మహిళలు, విద్యార్థులు, పెద్దలందరూ ఎదురుచూస్తున్నారని హరీశ్‌రావు, కేటీఆర్‌ అన్నారు. ఇది ప్రజల సభ అని, తమకు ఆతిథ్యం ఇస్తున్నారని, చాలాకాలం తర్వాత కేసీఆర్‌ వస్తుండడంతో పండుగ వాతావరణం ఏర్పడుతోందని పేర్కొన్నారు. కార్యక్రమంలో మాజీమంత్రి కొప్పుల ఈశ్వర్‌, బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు విద్యాసాగర్‌రావు, ఎమ్మెల్సీ ఎల్‌.రమణ, ఎమ్మెల్యేలు రాజేశ్వర్‌రెడ్డి, వేముల ప్రశాంత్‌రెడ్డి, కౌశిక్‌రెడ్డి, సంజయ్‌, లక్ష్మీనారాయణ, ఆర్‌కే.ప్రవీణ్‌, దావ వసంత, బాపురెడ్డి, రమణారావు, ఆయా నియోజకవర్గాల ఇన్‌చార్జిలు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement