జగిత్యాలటౌన్: రెండున్నరేళ్ల కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోందని, రేవంత్‌రెడ్డి పోవాలి, కేసీఆర్ రావాలి అని ప్రజలు బలంగా కోరుకుంటున్నారని, రాష్ట్రంలో రాబోయేది బీఆర్‌ఎస్ ప్రభుత్వమేనని మాజీమంత్రి జీవన్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఈనెల 20న నిర్వహించే కేసీఆర్ బహిరంగ సభ సన్నాహక సమావేశం పట్టణంలోని దేవిశ్రీగార్డెన్లో శనివారం నిర్వహించారు. సమావేశానికి పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు. నాలుగు దశాబ్దాలపాటు కాంగ్రెస్ పార్టీకి సేవలందించిన తాను 20నెలలుగా తీవ్ర మానసిక క్షోభ అనుభవిస్తున్నానని ఉద్వేగానికి గురయ్యారు. రేవంత్‌రెడ్డి పాలనలో కేబినెట్ సహచరులు తప్ప అన్నివర్గాలు దోపిడీకి గురవుతున్నాయని, దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీ జెండా మోసిన కార్యకర్తలకు సొంత పార్టీలో జరుగుతున్న అన్యాయాన్ని చూడలేక పార్టీ మారాల్సి వచ్చిందని తెలిపారు. ఈనెల 20న జగిత్యాలలో బహిరంగ సభ వేదికగా కేసీఆర్ సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరుతున్నానని అన్నారు. రైతులు, రైతు కూలీలు, కార్మిక, కర్షకులతో ఆనాడు జగిత్యాలలో నిర్వహించిన జగిత్యాల జైత్రయాత్ర యావత్ సమాజాన్ని మేల్కొలిపినట్లుగానే కేసీఆర్ బహిరంగ సభ యావత్ తెలంగాణ సమాజాన్ని జాగృతం చేస్తుందన్నారు. రాబోయే రెండేళ్లు ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేస్తానని అన్నారు. రాష్ట్ర పునర్నిర్మాణం కేసీఆర్‌తోనే సాధ్యమవుతుందని ప్రజలు భావిస్తున్నారని తెలిపారు. రాష్ట్ర భవిష్యత్ దిక్సూచి కేసీఆర్ తిరిగి ముఖ్యమంత్రి కావాలని ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు. కేసీఆర్ బహిరంగ సభను జయప్రదం చేసేందుకు ఊరువాడ తరలిరావాలని కోరారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్సీ ఎల్.రమణ, జెడ్పీ మాజీ చైర్‌పర్సన్ దావ వసంత, మున్సిపల్ మాజీ చైర్మెన్లు విజయలక్ష్మి, జీఆర్.దేశాయ్ తదితరులు పాల్గొన్నారు.


