కోరుట్ల: సత్వర న్యాయ సేవల విస్తరణే లక్ష్యంగా కోరుట్లలో అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోర్టు ప్రారంభించామని హైకోర్టు జడ్జి రేణుకా యార అన్నారు. పట్టణంలో ఏర్పాటు చేసిన జూనియర్ సివిల్ జడ్జి కోర్టును శనివారం ప్రారంభించారు. కక్షిదారులకు సత్వర న్యాయ సేవలు అందించేందుకు న్యాయవాదులు కృషి చేయాలన్నారు. కోరుట్ల బార్ అసోసియేషన్ అధ్యక్షుడు తోట ఆంజనేయులు మాట్లాడుతూ అదనపు కోర్టు ప్రారంభంతో పెండింగ్ కేసుల భారం తగ్గి ప్రజలకు వేగవంతమైన న్యాయం అందుతుందని అన్నారు. కొత్త కోర్టుకు శాశ్వత న్యాయమూర్తిని నియమించాలని కోరారు. నిర్మాణంలో ఉన్న కోర్టు భవనాలను ఆగస్టు వరకు పూర్తి చేసి ప్రారంభించుకునే అవకాశం ఉందన్నారు. ఈ సందర్భంగా జడ్జి రేణుక నిర్మాణంలో ఉన్న నూతన కోర్టు భవనాలను పరిశీలించారు. ఆమె రాకతో పోలీసులు బందోబస్తు నిర్వహించారు. జిల్లా సెషన్స్ జడ్జి సి.రత్న పద్మావతి, మొదటి అదనపు సెషన్స్ జడ్జి సునీతా రవీంద్రారెడ్డి, ఎస్పీ అశోక్ కుమార్, కోరుట్ల తహసీల్దార్ కృష్ణ చైతన్య, న్యాయమూర్తులు, బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి సుతారి శ్రీనివాస్, ఉపాధ్యక్షులు అంబల్ల నాగనిర్మల తదితరులు పాల్గొన్నారు.
హైకోర్టు జడ్జిని కలిసిన జగిత్యాల న్యాయవాదులు
జగిత్యాలజోన్: హైకోర్టు జడ్జిని జగిత్యాల బార్ అసోసియేషన్ న్యాయవాదులు మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లా కేంద్రంలోని కోర్టులో అదనంగా ఎస్సీ, ఎస్టీ కోర్టు, ఫ్యామిలీ కోర్టు, వినియోగదారుల ఫోరం ఏర్పాటుతోపాటు ప్రస్తుతం ఉన్న కోర్టుపై అదనపు గదుల నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని వినతిపత్రం అందించారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎర్ర నర్సయ్య, ప్రధాన కార్యదర్శి అందె మారుతి, న్యాయవాదులు పాల్గొన్నారు.


