జగిత్యాల: జిల్లా కేంద్రంలో ఈనెల 20న నిర్వహించేది బీఆర్‌ఎస్ పార్టీ బహిరంగ సభనా..? జీవన్‌రెడ్డి చేరిక సభనా.. బీఆర్‌ఎస్ నాయకులు తెలపాలని మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ అన్నారు. శనివారం మోతె కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. బీఆర్‌ఎస్ పార్టీ 33 జిల్లాల్లో ఎక్కడ బహిరంగ సభలు ఏర్పాటు చేసుకున్నా తమకు ఎలాంటి అభ్యంతరం లేదని, జగిత్యాల సభపై కేటీఆర్, హరీశ్‌రావు క్లారిటీ ఇవ్వాలని సూచించారు. బీఆర్‌ఎస్ అధికారంలో ఉన్న సమయంలో అడ్డగోలుగా సంపాదించిన డబ్బుతో జన సమీకరణ చేస్తున్నారని ఆరోపించారు. కేవలం 12 నుంచి 15వేల మంది పట్టే స్థలంలో నియోజకవర్గానికి ఒక ఇన్‌చార్జిని పెట్టి జన సమీకరణ చేస్తున్నారని తెలిపారు. సీనియర్ నాయకుడు జీవన్‌రెడ్డి పార్టీని వీడటం బాధాకరంగా ఉందని, ఆయన ఆరోపణలను ఖండించారు. బీఆర్‌ఎస్ పార్టీ గొప్పగా పనిచేస్తుందని జీవన్‌రెడ్డి చెబుతున్నారని, 2023లో ప్రజలు ఎందుకు తిరస్కరించారో చెప్పాలన్నారు. జీవన్‌రెడ్డి తరచూ సీఎంను విమర్శించడం తగదన్నారు. పేదలకు రేషన్‌కార్డులు ఇచ్చినందుకా.. ఇందిరమ్మ ఇళ్లు కట్టించిందుకా.. సన్నబియ్యం పంపిణీ చేస్తున్నందుకా..? రేవంత్ ఎందుకు దిగిపోవాలో చెప్పాలన్నారు. జీవన్‌రెడ్డికి రాజ్యసభ, సలహదారు పదవి ఇవ్వనందుకే పార్టీ మారారని ఆరోపించారు. జీవన్‌రెడ్డి చెల్లని రూపాయి అని కేటీఆర్ ఎన్నికల ప్రచారంలో మాట్లాడారని, నేడు ఎలా చెల్లుబాటు అవుతుందని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ బలంగానే ఉందని, జీవన్‌రెడ్డి పార్టీ మారినా నష్టమేమీ లేదన్నారు. కొండగట్టు బస్సు ప్రమాదంలో 60మంది చనిపోతే రాని కేసీఆర్ జైత్రయాత్ర పేరుతో జగిత్యాలకు రావడం విడ్డూరంగా ఉందన్నారు. ఎమ్మెల్యే సంజయ్‌కుమార్, డీసీసీ అధ్యక్షుడు నందయ్య, మున్సిపల్ చైర్‌పర్సన్ సమిండ్ల వాణి, బండ శంకర్ పాల్గొన్నారు.


