అనర్హులకు శాతవాహన ఈసీలో చోటు సీనియర్లను కాదని జూనియర్లకు బాధ్యతలు ఉన్నత విద్యామండలికి తప్పడు సమాచారం ఎస్సారార్ కళాశాలకు పాలకమండలిలో దక్కని ప్రాతినిధ్యం
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: శాతవాహన యూనివర్సిటీని వివాదాలు ఇప్పట్లో వీడేలా లేవు. తాజాగా వెలువడిన కొత్త పాలకమండలి సభ్యుల విషయం యూనివర్సిటీలో చర్చనీయాంశంగా మారింది. అర్హతలు లేని వారికి పాలకమండలిలో చోటు కల్పించారని, అర్హత ఉన్నవారిని పక్కన బెట్టారన్న వాదనలు వర్సిటీలోని ప్రతీ విభాగంలో మార్మోగుతున్నాయి. తాజాగా వెలువడిన పాలకమండలిలో సీనియర్ ప్రొఫెసర్ స్థానంలో అసోసియేట్ ప్రొఫెసర్‌కు చోటు కల్పించారు. యూనివర్సిటీలో ప్రస్తుతం ఇద్దరే ప్రొఫెసర్లు ఉన్నారు. అందులో ఒకరు వరప్రసాద్, మరొకరు సూరేపల్లి సుజాత. ఇటీవల సుజాతకు ఇప్పటికే నాలుగు పదవుల్లో కోతపెట్టిన వీసీ ఉమేశ్ కుమార్ ఈసారి పాలకమండలిలో చోటు ఇవ్వకపోగా వారి కన్నా జూనియర్, అసోసియేట్ ప్రొఫెసర్ అయిన జాఫర్ జారీకి చోటు కల్పించడం చర్చనీయాంశంగా మారింది. వాస్తవానికి ఆయనకు ఇంకా ప్రొఫెసర్ హోదా రాలేదు. అయినా ఉన్నత విద్యామండలికి ఆయన్ను సీనియర్ ప్రొఫెసర్‌గా చూపించడం విడ్డూరంగా ఉందని వర్సిటీ సిబ్బందే వాపోతున్నారు. ఇప్పటికీ శాతవాహన యూనివర్సిటీ అధికారిక వెబ్‌సైట్‌లోనూ మహమ్మద్ జాఫర్ అసోసియేట్ ప్రొఫెసర్ అనే పేర్కొనడం గమనార్హం.
ఎస్‌ఆర్‌ఆర్ కాలేజీకి దక్కని ప్రాధాన్యం
ఉమ్మడి జిల్లాలోనే కాదు.. ఉత్తర తెలంగాణలోనే శ్రీ రాజరాజేశ్వర కాలేజీకి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ప్రస్తుతం హాస్టల్ సదుపాయంతో అటామనస్ హోదా కలిగి ఉంది. అలాంటి ఈ కళాశాలకు ఈసారి పాలకమండలిలో సభ్యత్వం దక్కకపోవడం హాట్ టాపిక్‌గామారింది. గత వీసీ మల్లేశం ఉన్న సమయంలో 2024 మార్చిలో పాలకమండలిని ప్రతిపాదించినా అది అమలులోకి రాలేదు. ఆ జాబితాలో ఎస్‌ఆర్‌ఆర్ కాలేజీతోపాటు, ప్రొఫెసర్ సూరేపల్లి సుజాతకు చోటు దక్కడం విశేషం. అదే జాబితాలో తాజా ఈసీ జాబితాలో ప్రొఫెసర్‌గా చూపించిన మహమ్మద్ జాఫర్‌ని అసోసియేట్ ప్రొఫెసర్‌గా పేర్కొనడం గమనార్హం. మొత్తానికి తాజా జాబితాలో సభ్యుల ఎంపిక, చూపించిన సమాచారంలో లోపాలపై ఇటు విద్యార్థులు, అటు వర్సిటీ సిబ్బంది మండిపడుతున్నారు.
బెయిల్ రద్దుకు న్యాయపోరాటం
ఇటీవల తమ వర్సిటీలో దళిత ప్రొఫెసర్లు, విద్యార్థులను అర్బన్ నక్సలైట్లంటూ ప్రచారం చేస్తున్న ఓ పార్ట్‌టైం ఫ్యాకల్టీ బెయిల్ రద్దుకు న్యాయపోరాటానికి దిగుతున్నామని శాతవాహన విద్యార్థి సంఘాల జేఏసీ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది. గతంలో శాతవాహన వైస్ చాన్స్‌లర్‌గా పనిచేసిన ప్రొఫెసర్ మల్లేశంను కూడా ఇదే తరహాలో సోషల్ మీడియాలో కించపరిచిన కేసులో ఆ ఫాకల్టీపై అట్రాసిటీ కేసు నమోదైందని గుర్తుచేశారు. ఇదేకాకుండ పలు కేసుల్లో రిమాండ్ ఖైదీగా జైలు జీవితం గడిపి.. ప్రస్తుతం బెయిల్ మీద ఉన్నాడని పేర్కొన్నారు. వర్సిటీలో అశాంతి.. ఆందోళనలకు కారణం అవుతున్న సదరు ఫాకల్టీ బెయిల్ రద్దుకు తాము కోర్టును ఆశ్రయిస్తామని వెల్లడించారు. బ్యాంకులను మోసం చేసిన వ్యక్తికి మా వర్సిటీలో స్థానం లేదని స్పష్టం చేశారు. కార్యక్రమంలో విద్యార్థులు కరికె మహేశ్, శివాజీ, లక్ష్మణ్, సాయి, ప్రవీణ్, అశోక్ తదితరులు పాల్గొన్నారు.
వీసీతో ఎమ్మార్పీఎస్ నేతల సమావేశం
జిల్లా ఎమ్మార్పీఎస్ నేతలు వీసీ ఉమేశ్‌కుమార్‌ను ఆయన ఛాంబర్‌లో శుక్రవారం కలిశారు. యూనివర్సిటీలో ప్రొఫెసర్ సూరేపల్లి సుజా తను అర్బన్ నక్సలైట్‌గా చిత్రీకరించడం, ఆమెకు ఉన్న పదవులను వరుసగా తొలగించడంపై వీసీతో ఆరా తీశారు. సుజాత విషయంలో ఎ లాంటి కక్షసాధింపు చర్యలు లేవని, వీసీ వారికి వివరణ ఇచ్చినట్లు తెలిసింది. అనంతరం ఎమ్మార్పీఎస్ నేతలు ప్రొఫెసర్ సుజాతను కలిసి సంఘీభావం తెలిపారు. దళితులపై అకారణంగా దు ష్ప్రచారానికి దిగితే.. ఉద్యమిస్తామని స్పష్టంచేశారు. జిల్లా అధ్యక్షులు అనిల్, రేణుకుంట్ల సాగర్, తునికి వసంత్, చెంచాల నవీన్ పాల్గొన్నారు.


