నేడు జిల్లాకు హైకోర్టు జడ్జి రాక | - | Sakshi
Sakshi News home page

నేడు జిల్లాకు హైకోర్టు జడ్జి రాక

Apr 18 2026 7:59 AM | Updated on Apr 18 2026 7:59 AM

జగిత్యాలజోన్‌: హైకోర్టు జడ్జి రేణుక యార శనివారం జిల్లాకు రానున్నారు. జిల్లాలోని కోరుట్ల పట్టణానికి మంజూరు చేసిన అదనపు జూనియర్‌ సివిల్‌ జడ్జి కం అదనపు జ్యూడిషియల్‌ మెజిస్ట్రేట్‌ కోర్టును హైకోర్టు జడ్జి ప్రారంభించనున్నారు. ప్రస్తుతం జిల్లా కేంద్రంలో 8 కోర్టులు, మెట్‌పల్లిలో 2 , ధర్మపురిలో ఒకటి, కోరుట్లలో ఇప్పటికే ఒక్క కోర్టు ఉండగా, మరో కోర్టు ఏర్పాటుతో జిల్లాలో కోర్టుల సంఖ్య 13కు చేరనుంది. హైకోర్టు జడ్జి రానున్న నేపథ్యంలో ఏర్పాట్లు పరిశీలించేందుకు శుక్రవారం జిల్లా ప్రధాన న్యాయమూర్తి రత్న పద్మావతి, ఇతర జడ్జిలు కోరుట్లకు వెళ్లారు.

నృసింహుని సేవలో అడిషనల్‌ జడ్జి

ధర్మపురి: జిల్లా అడిషనల్‌ జడ్జి సునీత రవీంద్రరెడ్డి దంపతులు శుక్రవారం ధర్మపురి శ్రీలక్ష్మీనృసింహస్వామిని దర్శించుకున్నారు. ముందుగా ఆలయం పక్షాన సంప్రదాయ రీతిలో మేళతాళాలతో స్వాగతం పలికారు. ప్రధాన, అనుబంధ ఆలయాల్లో స్వామివారలను దర్శించుకున్నారు. అనంతరం అర్చకులు స్వామివారి శేషవస్త్రం, ప్రసాదం అందజేశారు. ఈవో శ్రీనివాస్‌, సూపరింటెండెంట్‌ కిరణ్‌కుమార్‌, సీనియర్‌ అసిస్టెంట్‌ అలువాలు శ్రీనివాస్‌, సిబ్బంది తదితరులున్నారు.

జగిత్యాల నుంచే కాంగ్రెస్‌ పతనం

రాయికల్‌(జగిత్యాల): జగిత్యాల నుంచే కాంగ్రెస్‌ పతనం ప్రారంభమవుతుందని ఎమ్మెల్సీ ఎల్‌.రమణ అన్నారు. శుక్రవారం రాయికల్‌ పట్టణంలో నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. సీఎం రేవంత్‌రెడ్డి ఆరుగ్యారెంటీలు అమలు చేస్తామని ప్రగల్భాలు పలికి విస్మరించారని అన్నారు. ఈనెల 20న నిర్వహించే భారీ బహిరంగ సభకు మాజీ సీఎం కేసీఆర్‌ హాజరవుతారని, పట్టణంతో పాటు, బీఆర్‌ఎస్‌, జీవన్‌రెడ్డి అభిమానులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు. ఎమ్మెల్యే పల్లపు రాజేశ్వర్‌రెడ్డి, జెడ్పీ మాజీ చైర్‌పర్సన్‌ దావ వసంత, రాయికల్‌ మున్సిపల్‌ చైర్మన్‌ కట్కం రవి, మండల అధ్యక్షుడు బర్కం మల్లేశ్‌, పట్టణ అధ్యక్షుడు ఎలిగేటి అనిల్‌కుమార్‌, సమన్వయ కమిటీ చైర్మన్‌ తురగ శ్రీధర్‌రెడ్డి, ఏఎంసీ మాజీ చైర్మన్‌ ఉదయశ్రీ పాల్గొన్నారు.

నేడు ఏర్పాట్లు పరిశీలించనున్న కేటీఆర్‌, హరీశ్‌రావు

జగిత్యాల: బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ఈనెల 20న జిల్లాకు రానున్న సందర్భంగా సభ ఏర్పాట్ల కోసం బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ప్రెసిడెంట్‌ కేటీఆర్‌, మాజీమంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు శనివారం జగిత్యాలకు రానున్నట్లు ఎమ్మెల్సీ ఎల్‌.రమణ పేర్కొన్నారు. మధ్యాహ్నం 1 గంటకు జగిత్యాలకు చేరుకుని ప్రజా ఆశీర్వాద సభ ఏర్పాట్లను పరిశీలిస్తారని తెలిపారు.

నువ్వుల సాగుతో

మంచి ఆదాయం

జగిత్యాలఅగ్రికల్చర్‌: వేసవి సీజన్‌లో నువ్వుల పంట ద్వారా మంచి ఆదాయం వస్తుందని వ్యవసాయ పరిశోధన స్థానం డైరెక్టర్‌ డాక్టర్‌ హారీశ్‌కుమార్‌శర్మ అన్నారు. జగిత్యాల రూరల్‌ మండలం పొలాస వ్యవసాయ పరిశోధన స్థానంలో వెల్దురి గ్రామ రైతులకు శుక్రవారం వ్యవసాయ ఉత్పాదకాలను పంపిణీ చేసి మాట్లాడారు. రాష్ట్రంలో నూనెగింజ పంటల విస్తీర్ణం తగ్గుతుందని, నువ్వులు, వేరుశనగ పంటలకు ఎప్పుడు డిమాండ్‌ ఉంటుందన్నారు. ప్రతీ రైతు కొంత విస్తీర్ణంలోనైనా నూనె గింజల పంటలు సాగు చేయాలని సూచించారు. ఈ సందర్భంగా రైతులకు భూసార పరీక్షా కార్డులు అందజేశారు. అంతకుముందు, రైతులు సాగు చేసిన నువ్వుల పంటను పరిశీలించారు. శాస్త్రవేత్తలు డాక్టర్‌ సంధ్యాకిషోర్‌, సుమలత, రైతులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement