ప్రమాద బాధితుల ప్రాణాలు కాపాడుదాం | - | Sakshi
Sakshi News home page

ప్రమాద బాధితుల ప్రాణాలు కాపాడుదాం

Apr 18 2026 7:59 AM | Updated on Apr 18 2026 7:59 AM

● ఎస్పీ అశోక్‌ కుమార్‌

జగిత్యాలక్రైం: ప్రమాద సమయంలో ప్రాణాలు కాపాడటంలో సీపీఆర్‌ కీలకమని ఎస్పీ అశోక్‌కుమార్‌ అన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా శుక్రవారం జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో ఫస్ట్‌ రెస్పాండర్స్‌కు సీపీఆర్‌, ఫస్ట్‌ ఎయిడ్‌పై ప్రధాన రహదారులకు ఆనుకుని ఉన్న దుకాణాలు, హోటళ్లు, పంక్చర్‌ షాపులు, పెట్రోల్‌ బంకుల నిర్వాహకులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, ప్రమాదం జరిగిన తర్వాత మొదటి గంటను గోల్డెన్‌ అవర్‌గా పరిగణిస్తారని, ఈ సమయంలో సరైన చికిత్స అందిస్తే చాలా మంది క్షతగాత్రుల ప్రాణాలను రక్షించవచ్చని పేర్కొన్నారు. సోషల్‌ మీడియాలో చూసి సరైన అవగాహన లేకుండా సీపీఆర్‌, ప్రథమ చికిత్స చేయడం వల్ల మరింత ప్రమాదం సంభవించే అవకాశం ఉందని వివరించారు. అందుకే శాసీ్త్రయ పద్ధతుల్లో శిక్షణ ఇవ్వడం కోసం ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారి ప్రాణాలు కాపాడే బాధ్యతగల పౌరులను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ‘రహ్‌ వీర్‌’ పథకం ద్వారా రూ.25,000 నగదు పారితోషికం, ప్రశంసాపత్రం అందజేయబడుతుందన్నారు. పోలీస్‌ కేసుల భయం కారణంగా కొందరు సాయం చేయడానికి వెనుకంజ వేస్తున్నారని తెలిపారు. గుడ్‌ సమారిటన్‌ చట్టం ప్రకారం సహాయం చేసినవారికి ఎలాంటి ఇబ్బందులు ఉండవని స్పష్టం చేశారు. ప్రమాదం జరిగిన వెంటనే 108 అంబులెన్స్‌కు సమాచారం ఇచ్చి, గాయపడిన వారిని సమీప ఆసుపత్రికి తరలించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డీఎంహెచ్‌వో సుజాత, వైద్యులు శ్రీనివాస్‌, రాజేందర్‌, సుధీర్‌, లవకుమార్‌, శ్రీకాంత్‌, డీసీఆర్బీ ఎస్సై ప్రదీప్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement