జగిత్యాలక్రైం: కోర్టు కేసుల్లో నిందితులకు శిక్ష పడేలా చేయడం, శిక్షల శాతాన్ని పెంచడం ద్వారా సమాజంలో మంచి మార్పు తీసుకురావచ్చని ఎస్పీ అశోక్ కుమార్ అన్నారు. ఎస్పీ కార్యాలయంలో కోర్టుల్లో నిందితులకు శిక్షలు పడేలా కృషి చేసిన పీపీలు రామకృష్ణరావు, ప్రణయ్, రాజేశ్‌ను అభినందించారు. జీవిత ఖైదు వంటి శిక్షలు పెరిగేలా పని చేయడం అభినందనీయమన్నారు. రెండు నెలల్లో 20 కేసుల్లో 36 మందికి జైలు శిక్ష పడిందన్నారు.
ఉత్సవాలకు ఏర్పాట్లు
పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఎస్పీ నెలవారీ నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. పోక్సో, గ్రేవ్, నాన్‌గ్రేవ్, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల దర్యాప్తును వేగవంతం చేయాలన్నారు. బక్రీద్, హనుమాన్ పెద్ద జయంతిని ప్రణాళికప్రకారం శాంతియుతంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. శాంతిభద్రతల సమస్యలు తలెత్తనీయొద్దని పేర్కొన్నారు. డీఎస్పీలు రఘుచందర్, రాములు, వెంకటరమణ, వెంకటరమణ పాల్గొన్నారు.


