చల్లని ప్రమాదం | - | Sakshi
Sakshi News home page

చల్లని ప్రమాదం

Apr 17 2026 11:08 AM | Updated on Apr 17 2026 11:08 AM

● నిప్పులు కురిపిస్తున్న భానుడు ● శీతల పానీయాల వైపు ప్రజలు ● ప్రమాదకరంగా మారుతున్న ఐస్‌ ● అనారోగ్యం పాలవుతున్న వైనం

జగిత్యాల: జిల్లా కేంద్రం.. నిత్యం వేలాది మంది వివిధ పనుల నిమిత్తం ఇక్కడకు వస్తుంటారు. ఎండలు ముదరడంతో చల్లని పానీయాల వైపు మళ్లుతున్నారు. మరికొందరు జ్యూస్‌ సెంటర్లను ఆశ్రయిస్తున్నారు. ఈ క్రమంలో జిల్లా కేంద్రంలో ఎక్కడబడితే అక్కడ జ్యూస్‌ సెంటర్లు వెలిశాయి. ఇంత వరకు బాగానే ఉన్నా.. అందులో వినియోగిస్తున్న ఐస్‌ మాత్రం ఎక్కడి నుంచి తెస్తున్నారో తెలియని పరిస్థితి నెలకొంది. ఐస్‌ను జ్యూస్‌లో కలిపి ఇవ్వడంతో ప్రజలు చల్లగా తాగేస్తున్నారు. అయితే వాటితో అనేక అనారోగ్య సమస్యలు వస్తాయని వైద్యులు పేర్కొంటున్నారు.

తాగితే అనర్థమే..

మార్చి నుంచే ఎండలు మండిపోతున్నాయి. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వచ్చేందుకు భయపడుతున్నారు. అత్యవసర పనులు నిమిత్తం జిల్లాకేంద్రానికి వస్తున్న ప్రజలు శీతల పానీయాలు తాగుతున్నారు. రోడ్డుపైనే చెరుకురసాలు, పండ్ల రసాలు, జ్యూస్‌లు, కూల్‌డ్రింక్స్‌ విక్రయిస్తుండడంతో దాహార్తి తీర్చుకునేందుకు ప్రజలు వాటి వైపు మళ్లుతున్నారు.

ఐస్‌ముక్కలతో పరేషాన్‌

చల్లదనం కోసం చెరుకురసం, జ్యూస్‌లో ఐస్‌ ముక్కలు కలిపి ఇస్తుంటారు. కానీ ఆ ఐస్‌ తాగితే గొంతునొప్పి వంటి సమస్యలకు కారణమవుతున్నాయి. సాధారణంగా ఐస్‌ను రెండు విధాలుగా తయారుచేస్తుంటారు. ఒకటి పారిశ్రామిక అవసరాలకు.. మరొకటి మాంసం, చేపలు, పండ్లు, ఔషధాల నిల్వ కోసం వినియోగిస్తుంటారు. ఐస్‌ను ఏ నీటితోనైనా తయారుచేయొచ్చు. పండ్ల రసాలకు వినియోగించే ఐస్‌ తయారీకి మాత్రం శుభ్రమైన నీటిని వాడాల్సి ఉంటుంది. పరిశుభ్రమైన వాతావరణంలో తయారుచేయాలి. ఈ ఐస్‌ తయారీకి కాస్త రిస్క్‌ ఎక్కువ. ఈ క్రమంలో కొందరు నాణ్యతలేని ఐస్‌ముక్కలను తయారీ చేస్తున్నారు. వీటితో గొంతునొప్పి, జ్వరం, అస్తమా వంటి వ్యాధులు వస్తుంటాయి. ముఖ్యంగా శీతల పానియాలు తాగువారు ఐస్‌ముక్కలు వేసుకోకుంటేనే మంచిదని వైద్యులు పేర్కొంటున్నారు. నాణ్యతలేని ఐస్‌ను గుర్తించడం కష్టమే అయినప్పటికీ ఏ ఐస్‌ వేస్తారో తెలియదు.

Advertisement
 
Advertisement
Advertisement