రేషన్‌ కార్డులకు ఎసరు..? | - | Sakshi
Sakshi News home page

రేషన్‌ కార్డులకు ఎసరు..?

Apr 17 2026 11:08 AM | Updated on Apr 17 2026 11:08 AM

● జిల్లాలో 10 వేల కార్డుల ఔట్‌ ● కొత్త కార్డుల జారీ నేపథ్యంలో..

కోరుట్ల: కొత్త కార్డుల జారీకి ఇటీవల దరఖాస్తులు తీసుకున్న నేపథ్యంలో ఇప్పటివరకు ఉన్న తెల్ల రేషన్‌కార్డుల్లో అనర్హుల లెక్క తేల్చేందుకు అధికార యంత్రాంగం చర్యలు చేపట్టినట్లు సమాచారం. ఇటీవల ప్రజాపాలన కార్యక్రమంలో కొత్తకార్డుల కోసం జిల్లావ్యాప్తంగా 35 వేల వరకు దరఖాస్తులు వచ్చాయి. వాటి జారీకి సంబంధించిన పరిశీలన కొనసాగుతోంది. ఈ కార్డులు మంజూరయ్యేలోపు గతంలో అనర్హులు కార్డులపొంది ఉంటే వాటిని తొలగించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. ఇందులో భాగంగా కార్డులు రద్దయ్యే అవకాశాలు ఉన్నవారి జాబితా కూడా రూపొందించినట్లు తెలుస్తోంది.

సుమారు 10వేలు

జిల్లాలోని 22 మండలాల్లో ప్రస్తుతం సుమారు 3.40 లక్షల రేషన్‌కార్డులు ఉన్నాయి. వీటిలో ప్రస్తుతం రద్దయ్యే కార్డుల సంఖ్య 10వేల వరకు ఉన్నట్లు సమాచారం. ఇందులో జగిత్యాల, కోరుట్ల, మెట్‌పల్లి వంటి పెద్ద పట్టణాల్లోనే రెండు వేల వరకు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. మిగిలిన అన్ని మండలాల్లో 150 నుంచి 250వరకు రేషన్‌కార్డులు రద్దయ్యే అవకాశాలు ఉన్నాయి. రద్దు కావడానికి అవకాశమున్న రేషన్‌ లబ్దిదారుల వివరాలను అన్ని తహసీల్దార్‌ కార్యాలయాలకు పంపించారు. మరోసారి తనిఖీ చేసి నివేదిక ఇవ్వాలని కోరినట్లు సమాచారం. ఈ మేరకు సదరు జాబితాను తహసీల్దార్‌ కార్యాలయం సిబ్బంది మరోసారి తుది పరిశీలన చేస్తున్నట్లు సమాచారం.

ఆన్‌లైన్‌ డేటా..

జిల్లాలో రేషన్‌కార్డులు కలిగి ఉన్న వారి జాబితాలో ఎవరైతే ఇన్‌కం టాక్స్‌ చెల్లించే వారు ఉన్నారో.. వారి జాబితాను ఆన్‌లైన్‌ ద్వారా సేకరించి వారి రేషన్‌ కట్‌ చేయడం కోసం జాబితా తయారు చేశారు. దీంతోపాటు రూ.10 లక్షల మించి విలువ ఉన్న విలాసవంతమైన కార్లు కలిగి ఉన్న వారి రేషన్‌కార్డులు, మూడున్నర ఎకరాలకు మించి భూమి ఉన్న వారిని ఆన్‌లైన్‌ ద్వారా గుర్తించినట్లు సమాచారం. ఆన్‌లైన్‌లో రేషన్‌ లబ్ధిదారుల పూర్తి సమాచారం సేకరించిన తరువాత రద్దుకు అవకాశమున్న వారి జాబితాను రూపొందించారు. ఈ లిస్టు ప్రకారం త్వరలో అనర్హుల వద్ద ఉన్న తెల్ల రేషన్‌కార్డులు దాదాపుగా రద్దు అయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

Advertisement
 
Advertisement
Advertisement