ఎన్ని ఆటంకాలు సృష్టించినా జనాన్ని అడ్డుకోలేరు బీఆర్‌ఎస్ జైత్రయాత్ర ఇక్కడే నుంచే మొదలు జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి కేసీఆర్ సభ ఏర్పాట్ల పరిశీలన
జగిత్యాలటౌన్: ప్రజలకు ఇచ్చిన హామీల అమలులో పూర్తిగా విఫలమైన కాంగ్రెస్ ప్రభుత్వ పతనానికి.. బీఆర్‌ఎస్ జైత్రయాత్రకు జగిత్యాల సభ వేదిక కానుందని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి అన్నారు. మాజీమంత్రి జీవన్‌రెడ్డి బీఆర్‌ఎస్‌లో చేరుతున్న సందర్భంగా జిల్లాకేంద్రంలోని మినీస్టేడియంలో ఈనెల 20న నిర్వహించ తలపెట్టిన బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ జనగర్జన సభ ఏర్పాట్లను జీవన్‌రెడ్డితోపాటు బీఆర్‌ఎస్ నాయకులతో కలిసి పరిశీలించారు. ఆరు గ్యారంటీల పేరుతో ప్రజలను మోసం చేసి అధికారంలోకొచ్చిన కాంగ్రెస్ ఒక్క హామీని కూడా అమలు చేయలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ తీరును ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు. సభకు ప్రభుత్వం ఎన్ని ఆటంకాలు సృష్టించినా.. జనాలను అడ్డుకోలేరని పేర్కొన్నారు. రెండేళ్లుగా పెండింగ్‌లో ఉన్న బ్రిడ్జి పనులను ఇప్పటికిప్పుడు ప్రారంభించారని, కోరుట్ల నుంచి జగిత్యాలకు వచ్చే రోడ్డును తవ్వి ట్రాఫిక్‌ను డైవర్ట్ చేయిస్తున్నారని తెలిపారు. సభ ఏర్పాటుతో బెంబేలెత్తిపోతున్న రేవంత్‌రెడ్డి.. ప్రజల దృష్టి మరల్చేందుకు మేడిగడ్డలో సభ పెడుతున్నారని విమర్శించారు. కాంగ్రెస్ చేసిన మోసాలను ఎక్కడికక్కడ ఎండగడతామన్నారు. ఆయన వెంట మాజీమంత్రి కొప్పుల ఈశ్వర్, బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు విద్యాసాగర్‌రావు, కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్, ఎమ్మెల్సీ ఎల్.రమణ, జెడ్పీ మాజీ చైర్‌పర్సన్ దావ వసంత, తక్కళ్లపల్లి రవీందర్‌రావు, లోక బాపురెడ్డి, పుప్పాల అశోక్ పాల్గొన్నారు.


