అడుగంటిన మిడ్‌మానేరు | - | Sakshi
Sakshi News home page

అడుగంటిన మిడ్‌మానేరు

Apr 17 2026 10:44 AM | Updated on Apr 17 2026 10:44 AM

బోయినపల్లి(చొప్పదండి): మొన్నటిదాకా జలసిరితో కళకళలాడిన రాజన్నసిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం మాన్వాడ మిడ్‌మానేరులో నీటిమట్టం ఇప్పుడు రోజురోజుకు అడుగంటుతోంది. ప్రాజెక్టుకు ఎలాంటి ఇన్‌ఫ్లో లేకపోవడం.. ప్రాజెక్టులో ఉన్న నీరు ఎల్‌ఎండీ ప్రాజెక్టులోకే తరలిపోవడం.. నీటిమట్టం తగ్గడానికి కారణమైంది. ప్రాజెక్టులో ఈ ఏడాది జనవరి 1న 26.74 టీఎంసీల మేర నీరు నిల్వ ఉండగా గురువారం 8.435 టీఎంసీల మేర నీరు మాత్రమే నిల్వ ఉంది. సుమారు 18 టీఎంసీల మేర నీరు బయటకు తరలిపోయింది. మండే ఎండలకు రోజుకు 145 క్యూసెక్కుల మేర నీరు ఆవిరి అవుతోంది. ప్రస్తుతం 2 గేట్ల ద్వారా ఎల్‌ఎండీకి 500 క్యూసెక్కులు, కుడికాల్వకు 450 క్యూసెక్కులు, ఎడమకాల్వకు 5 క్యూసెక్కుల మేర నీరు విడుదల చేస్తున్నారు.

మరో మూడు రోజులు ఆయకట్టుకు నీరు

మిడ్‌మానేరు ప్రాజెక్టు మూడు డివిజన్ల కింద సుమారు 50వేల ఎకరాల మేర ఆయకట్టుకు కుడికాల్వ ద్వారా యాసంగి పంటలకు నీరు విడుదల చేస్తున్నట్లు మిడ్‌మానేరు ఇంజినీరింగ్‌ అధికారులు తెలిపారు. కుడికాల్వ ద్వారా ఆయకట్టుకు ఇప్పటి వరకు 3.146 టీఎంసీల మేర నీరు వదిలారు. కుడికాల్వ ద్వారా ఇల్లంతకుంట, గన్నేరువరం, మానకొండూర్‌, హుస్నాబాద్‌, కోహెడ తదితర మండలాల్లోని పంట పొలాలకు నీరు అందిస్తున్నట్లు తెలిపారు.

ఎల్‌ఎండీకి 16 టీఎంసీల నీటి తరలింపు

మిడ్‌మానేరు ప్రాజెక్టు ప్రారంభం నుంచి ప్రతీ ఏడు ఎల్‌ఎండీ ఆయకట్టుకు, కరీంనగర్‌ పట్టణ తాగునీటి అవసరాలకు మెజార్టీగా మిడ్‌మానేరు ప్రాజెక్టు నీరే పెద్ద దిక్కు అవుతోంది. గత జనవరి 11 నుంచి ఏప్రిల్‌ 16 వరకు మిడ్‌మానేరు నుంచి ఎల్‌ఎండీకి 16.848 టీఎంసీల మేర నీరు విడుదల చేశారు. ప్రస్తుతం 2 గేట్ల ద్వారా ఎల్‌ఎండీకి రోజుకు 500 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు. గత మూడేళ్లుగా మిడ్‌మానేరు నుంచి ఎల్‌ఎండీ ప్రాజెక్టులోకి సుమారు 80 టీఎంసీల మేర భారీగా నీరు వది లారు. ఎల్‌ఎండీకి మరో అర టీఎంసీ మేర మాత్ర మే నీరు వదులుతామని అధికారులు తెలిపారు.

మూడేళ్లుగా కాళేశ్వరం నీళ్లు బంద్‌

జనవరి 2023 నుంచి మార్చి 2023 వరకు కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి వరదకాల్వ మీదుగా మిడ్‌మానేరు ప్రాజెక్టులోకి 26.70 టీఎంసీల మేర నీరు వచ్చి చేరింది. అప్పుడు కాళేశ్వరం జలాలు భారీగా రావడంతో మిడ్‌మానేరు ప్రాజెక్టు నిండుకుండలా ఉంది. ఇప్పుడు ప్రాజెక్టుకు గత రెండేళ్లుగా కాళేశ్వరం నీళ్లు నిలిచిపోవడంతో పై ప్రాంతం నుంచి భారీ ఇన్‌ఫ్లో లేదు. ఔట్‌ఫ్లో మాత్రమే ఉండడంతో మిడ్‌మానేరు ప్రాజెక్టు ఖాళీ అవుతోంది. ప్రస్తుతం కేవలం 8 టీఎంసీల మేర నీటి నిల్వకే పరిమతమైంది. ప్రాజెక్టు బ్యాక్‌వాటర్‌ ఇప్పుడు 9 కిలోమీటర్ల మేరకే పరిమతమైంది. మరో రెండు నెలలు నిండు వేసవి ఉన్న తరుణంలో మిడ్‌మానేరు ప్రాజెక్టులో నీటిమట్టం ఎలా ఉంటుందోనని రైతుల్లో ఆందోళన నెలకొంది.

మిషన్‌ భగీరథకు రోజుకు 45 క్యూసెక్కులు

ప్రాజెక్టులో 8 టీఎంసీలు ఉన్నా సిరిసిల్ల, వేములవాడ, చొప్పదండి నియోజకవర్గాల్లోని గ్రామాలకు మిషన్‌ భగీరథ నీటి పథకానికి రోజుకు సుమారు 45 క్యూసెక్కుల మేర నీరు విడుదల చేస్తున్నారు. మిడ్‌మానేరులో చివరికి 4 టీఎంసీల వరకు నీరు ఉన్నా మిషన్‌ భగీరథకు నీరు విడుదల చేయవచ్చని అధికారులు పేర్కొంటున్నారు.

జూలై 31 వరకు 7 టీఎంసీలు ఉండేలా చర్యలు

మిడ్‌మానేరు ప్రాజెక్టు నుంచి ఎల్‌ఎండీకి, కుడి, ఎడమ కాల్వల ద్వారా నీరు విడుదల చేసినప్పటికీ జూలై చివరి వరకు 7 టీఎంసీల మేర నీరు ఉండేలా చూసుకుంటామని ఇంజినీరింగ్‌ అధికారులు తెలిపారు. ఈమేరకు ప్రణాళికను ఇప్పటికే రూపొందించుకున్నారు.

భారీగా తగ్గుతున్న నీటి నిల్వలు

8 టీఎంసీలకు పడిపోయిన నీటిమట్టం

ఎల్‌ఎండీలోకి తరలిన నీరు

మండే ఎండలకు భారీగా నీరు ఆవిరి

మిడ్‌మానేరు ప్రాజెక్టు స్వరూపం

పూర్తి నీటి సామర్థ్యం : 27.55 టీఎంసీలు

ప్రస్తుత నీటిమట్టం : 8.435 టీఎంసీలు

కుడి, ఎడమ కాలువలకు నీటివిడుదల

: 3.146 టీఎంసీలు

మిషన్‌భగీరథ నీటి పథకానికి

: 0.454 టీఎంసీ

ఎల్‌ఎండీకి తరలిన నీరు

: 16.848 టీఎంసీలు

ఎండలకు ఆవిరి అయిన నీరు

: 1.521 టీఎంసీలు

Advertisement
 
Advertisement
Advertisement