ఇల్లంతకుంట(మానకొండూర్): పనులు పూర్తి చేసి రెండేళ్లు గడుస్తున్నా బిల్లులు చెల్లించలేదని మండలంలోని వల్లంపట్ల మాజీ సర్పంచ్ ప్రభుత్వ పాఠశాల గదులకు గురువారం తాళాలు వేశారు. సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం వల్లంపట్ల ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో రూ.22.30లక్షతో మూడు గదులు, రూ.21.80లక్షలతో హైస్కూల్‌లో డైనింగ్‌హాల్, ఇతర పనులను మాజీ సర్పంచ్ కేతిరెడ్డి అనసూయ చేశారు. పనులు పూర్తి చేసి రెండేళ్లు గడుస్తున్నా బిల్లులు మంజూరుకాలేదు. దీంతో గురువారం ఉదయం ప్రాథమిక పాఠశాలలోని మూడు గదులకు, హైస్కూల్‌లోని డైనింగ్‌హాల్‌కు తాళాలు వేశారు. విషయం తెలుసుకున్న ఎస్సై అశోక్ వచ్చి తాళాలు వేసిన గదులను పరిశీలించారు.
రెండు గదులలో విద్యార్థుల సర్దుబాటు
పాఠశాల గదులకు తాళాలు వేయడంతో ఒక గదిలో 1, 2, 3 తరగతి విద్యార్థులను, మరో గదిలో 4, 5వ తరగతి విద్యార్థులను కూర్చోపెట్టినట్టు హెచ్‌ఎం శ్రీనివాస్ తెలిపారు. ఎంఈవో శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ వల్లంపట్లలోని ప్రభుత్వ పాఠశాలల గదులకు తాళం వేసిన విషయాన్ని జిల్లా విద్యాధికారికి తెలియజేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ కేతిరెడ్డి అనసూయ మాట్లాడుతూ రెండేళ్ల క్రితం అధికారులు మెడపై కత్తి పెట్టి పనులు చేయించడంతో రూ.44లక్షల పనులు చేసినట్లు తెలిపారు. ఇంకా రూ.20 లక్షల వరకు బిల్లులు రావాల్సి ఉందని, తన బంగారం అమ్మి పనులు చేపించినట్లు ఆవేదన వ్యక్తం చేశారు. బిల్లులు చెల్లించే వరకు తాళాలు తీయబోమన్నారు.
మాజీ సర్పంచ్ దంపతులపై కేసు
పాఠశాల గదులకు, భోజనశాలకు, తాళం వేసి విద్యార్థులు, ఉపాధ్యాయులకు ఇబ్బంది కలిగించిన మాజీ సర్పంచ్ దంపతులపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై అశోక్ తెలిపారు. ప్రాథమిక పాఠశాలలోని మూడు తరగతి గదులకు, హైస్కూల్ డైనింగ్ హాలుకు తాళం వేసినట్టు పేర్కొన్నారు. విద్యార్థులు, ఉపాధ్యాయులకు ఇబ్బంది కలగజేసినందుకు కేసు నమోదు చేసినట్లు వివరించారు.
వల్లంపట్ల మాజీ సర్పంచ్‌పై కేసు


