గాయపడిన వ్యక్తి మృతి | - | Sakshi
Sakshi News home page

గాయపడిన వ్యక్తి మృతి

Apr 17 2026 10:44 AM | Updated on Apr 17 2026 10:44 AM

జగిత్యాలక్రైం: రోడ్డు ప్రమాదంలో గాయపడిన జగిత్యాల రూరల్‌ మండలం అనంతారం గ్రామానికి చెందిన దండవేని సుధాకర్‌ (57) చికిత్స పొందుతూ గురువారం మృతిచెందాడు. సుధాకర్‌ అతని కుమారుడు శ్రీపాల్‌ ఈనెల 11న ద్విచక్ర వాహనంపై జగిత్యాలకు వస్తుండగా రాజీవ్‌గాంధీ చౌరస్తా వద్ద కారు అతివేగంగా వచ్చి ఢీకొంది. సుధాకర్‌, శ్రీపాల్‌కు గాయాలయ్యాయి. సుధాకర్‌ను కరీంనగర్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. వైద్యులు ప్రయత్నించినా ఫలితం లేకుండాపోయింది. శ్రీపాల్‌ ఫిర్యాదు మేరకు కారు డ్రైవర్‌పై కేసు నమోదు చేసినట్లు పట్టణ ఎస్సై సదాకర్‌ తెలిపారు.

సౌదీలో దాచారం వాసి..

ఇల్లంతకుంట(మానకొండూర్‌): రాజన్నసిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం దాచారం గ్రామానికి చెందిన పొన్నం దశరథంగౌడ్‌(56) సౌదీలో గురువారం తెల్లవారుజామున గుండెపోటుతో మరణించినట్లు గ్రామస్తుల ద్వారా తెలిసింది. దశరథం గత ఇరువై ఏళ్లుగా సౌదీ అరేబియాలోని జుబెల్‌ సిటీలోని ఓ ప్రైవేట్‌ కంపెనీలో పనిచేస్తున్నాడు. అతని భార్య సుమలత అక్కడే కొన్ని నెలలు ఉండి తిరిగి బుధవారం తెల్లవారుజామున ఇండియాకు తిరిగి వచ్చింది. ఆమెను ఫ్లైట్‌ ఎక్కించి డ్యూటీకి వెళ్లారు. కంపెనీలో పనిచేస్తుండగానే గుండెపోటుకు గురై ప్రాణాలు కోల్పోయాడు. దశరథంగౌడ్‌కు ఇద్దరు కుమారులు, భార్య సుమలత ఉన్నారు.

కట్టెల లారీ బోల్తా

జగిత్యాలక్రైం: జగిత్యాలరూరల్‌ మండలం తక్కళ్లపల్లి శివారులో గురువారం ఉదయం కట్టెల లారీ బోల్తాపడింది. కట్టెల లోడ్‌తో వెళ్తున్న లారీ జగిత్యాల–ధర్మపురి ప్రదాన రహదారిపై తక్కళ్లపల్లి శివారులో అదుపుతప్పి బోల్తాపడింది. ఉదయం వేళ కావడం.. రోడ్డుపై ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. డ్రైవర్‌తోపాటు, క్లీనర్‌కు స్వల్ప గాయాలయ్యాయి.

కుక్కల దాడిలో గొర్రెలు మృతి

ఎలిగేడు: పెద్దపల్లి జిల్లా ఎలిగేడులోని గుజ్జుల కనకయ్య చెందిన గొర్రెలు మందపై గురువారం తెల్లవారుజామున కుక్కలు దాడిచేశాయి. ఇందులో 7 గొర్రెలు మృతి చెందాయని బాధితుడు తెలిపాడు. వాటివిలువ దాదాపు రూ.80 వేలు ఉంటుందని వాపోయాడు. ప్రభుత్వం ఆదుకోవాలని కనకయ్య విన్నవించాడు.

Advertisement
 
Advertisement
Advertisement