భర్తతో ఘర్షణ పడి వివాహిత ఆత్మహత్య | - | Sakshi
Sakshi News home page

భర్తతో ఘర్షణ పడి వివాహిత ఆత్మహత్య

Apr 17 2026 10:44 AM | Updated on Apr 17 2026 10:44 AM

ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): రాజన్నసిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గుండారం పంచాయతీ పరిధిలోని పోచమ్మతండాకు చెందిన అజ్మీర అనిత(38) భర్తతో ఘర్షణపడి మనస్థాపంతో ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఎస్సై రాహుల్‌రెడ్డి తెలిపిన వివరాలు. అనిత భర్త భాస్కర్‌ పదేళ్లుగా దుబాయ్‌కి వెళ్లి వస్తున్నాడు. ఏడాది క్రితం స్వగ్రామానికి వచ్చిన భాస్కర్‌ తిరిగి దుబాయ్‌కి వెళ్లాడు. ఇంటి వద్దనే ఉంటున్న అనితకు భర్త భాస్కర్‌ మధ్య ఇటీవల కొన్ని విభేదాలు వచ్చాయి. కొంతకాలంగా భర్త తనతో ఫోన్‌లో మాట్లాడడం లేదని అనిత తండాలో పలువురితో చెప్పుకొని బాధపడుతుండేది. ఈక్రమంలోనే బుధవారం రాత్రి భర్తతో వీడియోకాల్‌ మాట్లాడింది. ఈ సందర్భంగా ఇద్దరి మధ్య మాటలు పెరిగి తీవ్ర స్థాయికి చేరాయి. మనస్థాపానికి గురైన అనిత మొదట వంటింట్లో ఉరివేసుకోవడానికి ప్రయత్నించింది. అనంతరం హాల్లోకి వచ్చి దులానికి ఉరివేసుకొని ప్రాణాలు కోల్పోయింది. దుబాయ్‌ నుంచి వస్తున్న భర్త భాస్కర్‌ చివరి చూపు కోసం అనిత మృతదేహాన్ని కుటుంబ సభ్యులు బంధువులు ఫ్రీజర్‌లో భద్రపరిచారు. భార్య, భర్తల మధ్య జరిగిన సంభాషణ కోసం పోలీసులు అనిత ఫోన్‌ను పరిశీలించారు. బుధవారం రాత్రి అనితకు వచ్చిన కాల్‌డేటాను పోలీసులు సేకరించారు. మృతురాలికి కుమారుడు, కూతురు ఉన్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

కోనరావుపేట(వేములవాడ): రాజన్నసిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం మల్కపేటకు చెందిన వివాహిత మానుక భానుశ్రీ(22) గురువారం ఆత్మహత్యకు పాల్పడింది. మామిడిపల్లికి చెందిన గెంటె శివయ్య–దేవలక్ష్మి దంపతుల కూతురు భానుశ్రీకి అదే మండలం మల్కపేటకు చెందిన మానుక కరుణాకర్‌తో ఆరేళ్ల క్రితం వివాహమైంది. వీరికి నాలుగేళ్ల బాబు ఉన్నాడు. భర్త కరుణాకర్‌ సౌదీలో ఉండడంతో ఇటీవల భానుశ్రీ కూడా సౌదీకి వెళ్లి కొద్ది రోజులు ఉండి వచ్చింది. గురువారం సాయంత్రం భర్తతో మాట్లాడిన వీడియోకాల్‌లో గొడవ జరిగింది. వీడియోకాల్‌ మాట్లాడిన వెంటనే కుమారుని ముందరే ఇంట్లోనే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. చుట్టు పక్కల వారు వచ్చి చూసేసరికి మృతి చెందింది. విషయం తెలుసుకుని మృతురాలి సోదరులు వేణు, రవి, బంధువులు ఆందోళనకు దిగారు. అత్తింటివారి వేధింపులతోనే భానుశ్రీ ఆత్మహత్య చేసుకుందని ఆరోపించారు. కోనరావుపేట ఎస్సై ప్రశాంత్‌రెడ్డి చేరుకుని ఆందోళన చేస్తున్న వారితో మాట్లాడి మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం సిరిసిల్ల జిల్లా ఆస్పత్రికి తరలించారు. మృతురాలి తల్లి గెంటె దేవలక్ష్మి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement