సిరిసిల్లక్రైం: జిల్లాలో మానవత్వాన్ని కలచివేసే ఘటన చోటుచేసుకుంది. ఒంటరిగా నివసిస్తున్న వృద్ధురాలిని లక్ష్యంగా చేసుకున్న నిందితుడు దొంగతనం కోసం హత్య చేయడం కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాలు. సిరిసిల్లలోని రాజీవ్‌నగర్‌లో కోన లక్ష్మి(75) ఇంట్లో ఒంటరిగా ఉండేది. ఇదే అవకాశంగా చూసుకున్న గడీల రాజు(55) అనే వ్యక్తి.. కొంతకాలంగా ఆమె ఇంటిని గమనిస్తున్నాడు. ఆర్థిక ఇబ్బందులు, మద్యానికి బానిస కావడంతో రాజు డబ్బుల కోసం దొంగతనాలకు అలవాటుపడ్డాడు. ఈనెల 13న మధ్యాహ్నం సమయంలో కత్తెరతో లక్ష్మి ఇంట్లోకి చొరబడ్డాడు. ఆమె నిద్రిస్తుండగా ఇంట్లో డబ్బుల కోసం వెతికాడు. నగదు, పత్రాలు, చీరలు సేకరించాడు. ఆ సమయంలో శబ్దం రావడంతో లేచిన వృద్ధురాలు అరవడంతో వెంటనే తన వద్ద ఉన్న కత్తెరతో ఆమె గొంతు, మెడపై పలుమార్లు దాడి చేయడంతో ప్రాణాలు కోల్పోయింది. తన దుస్తులపై పడిన రక్తపు మరకలు చూస్తే స్థానికులకు అనుమానం వస్తుందని వెంటనే ఇంటికి వెళ్లి వాటిని మార్చుకున్నాడు. వృద్ధురాలి ఇంటిలో ఇంకా ఏమైన డబ్బులు, బంగారం దొరుకుతుందన్న అత్యాశతో మళ్లీ వచ్చి అన్ని వెతికాడు. కానీ ఏమి దొరక్కపోవడంతో వృద్ధురాలి చెవికి ఉన్న బంగారు పోగుల కోసం చెవులు కోసేశాడు. వాటిని ఇంటికి తీసుకెళ్లాడు. రక్తం పట్టిన బట్టలను ఆనవాళ్లు లేకుండా కాల్చివేశాడు. మూడు రోజులుగా గాలిస్తున్న పోలీసులకు స్థానికంగా ఉన్న సీసీ ఫుటేజీ ఆధారంగా హంతకుడిని పట్టుకున్నట్లు డీఎస్పీ నాగేంద్రచారి వెల్లడించారు. హంతకుడు వృద్ధురాలి ఇంటి నుంచి తీసుకున్న రూ.2 వేల నగదు, హత్యకు ఉపయోగించిన కత్తెర, రెండు చీరలు, బ్యాంక్ పాస్‌బుక్కులు, ఆరోగ్యశ్రీ కార్డు, వికలాంగ సర్టిఫికెట్ స్వాధీనం చేసుకున్నారు. అయితే చెవి పోగులకు అంటుకున్న రక్తాన్ని కడిగే క్రమంలో అవి చేజారిపోయినట్లు హంతకుడు పోలీసులకు వెల్లడించడం గమనార్హం.
చేధించిన పోలీసులు


