బడిబాట పట్టేలా.. | - | Sakshi
Sakshi News home page

బడిబాట పట్టేలా..

Apr 16 2026 11:59 AM | Updated on Apr 16 2026 11:59 AM

● జూన్‌ 12 వరకు కార్యక్రమం ● ప్రభుత్వ ఉపాధ్యాయుల ముమ్మర ప్రచారం ● ప్రవేశాల పెంపే లక్ష్యంగా పోస్టర్లు, కరపత్రాలు ● ఇంటింటికీ వెళ్లి తల్లిదండ్రులను ఆకట్టుకునే ప్రయత్నాలు

మల్లాపూర్‌: వేసవి సెలవులు వచ్చాయంటే ఏ గల్లీకి వెళ్లినా ప్రైవేట్‌ పాఠశాలల సిబ్బందే కనిపిస్తారు. పిల్లలను తమ స్కూళ్లల్లో చేర్చాలని తల్లిదండ్రలను కోరుతుంటారు. ఆ పరిస్థితులకు భిన్నంగా ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు తమ పాఠశాలల్లో చేర్పించండంటూ ప్రచారం చేస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల పెంపే లక్ష్యంగా ప్రభుత్వం ముందస్తు బడిబాట కార్యక్రమాన్ని ప్రారంభించింది. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఈనెల 6 నుంచి జూన్‌ 12 వరకు బడిబాట నిర్వహించాలని ఆదేశించింది. గతేడాది హెచ్‌ఎంలు, ఉపాధ్యాయులు అమ్మ ఆదర్శ కమిటీల సహకారంతో స్వచ్ఛందంగా బడిబాట నిర్వహించి విద్యార్థుల పెంపే లక్ష్యంగా పనిచేశారు.

విద్యార్థుల గుర్తింపు

సాధారణంగా ప్రభుత్వం బడిబట కార్యక్రమాన్ని జూన్‌ రెండో తేదీ నుంచి నిర్వహిస్తుంది. ఈ ఏడాది మాత్రం ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా ముందస్తుగా కార్యక్రమాన్ని చేపట్టింది. ప్రస్తుతం ఒంటిపూట బడులు కొనసాగుతున్న నేపథ్యంలో ఉదయం 7 నుంచి 8 గంటల మధ్య బడిబాట చేపడుతున్నారు. బడిబయట ఉన్న పిల్లలు, ప్రైవేటు పాఠశాలలకు వెళ్లేవారిని గుర్తిస్తున్నారు. పాఠశాలల్లో కల్పిస్తున్న సౌకర్యాలు, డిజిటల్‌ తరగతులు గురించి పిల్లలు, తల్లిదండ్రులకు వివరిస్తున్నారు. ఉచితంగా పాఠ్య పుస్తకాలు, నోట్‌బుక్కులు, యూనిఫాం అందిస్తున్నామని చెబుతన్నారు. నాణ్యమైన విద్య అందిస్తామని, ఏఐ ద్వారా బోధిస్తామని హామీ ఇస్తున్నారు. ఆంగ్లంలో బోధన, ప్రతినెలా తల్లిదండ్రుల సమావేశం.. ఇలా పలు అంశాలను అజెండాగా ఎంచుకుని ప్రచారం చేస్తున్నారు. సౌకర్యాలపై కరపత్రాలు, చిన్నపాటి పోస్టర్లను ముద్రించారు.

Advertisement
 
Advertisement
Advertisement