రాష్ట్రంలోనే రెండోస్థానం
జగిత్యాలరూరల్: గ్రామాల అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విడుదల చేస్తున్న నిధులతోపాటు ఇంటి పన్ను వసూళ్లు ప్రధాన ఆదాయ వనరులుగా మారాయి. ఇందుకోసం జిల్లాలోని అన్ని పంచాయతీల్లో 100 శాతం పన్నుల వసూలుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇందులోభాగంగా 2025–26 ఆర్థిక సంవత్సరంలో జిల్లాలో ఇంటి పన్ను వసూళ్లు ఆశించిన స్థాయిలో చేయగలిగారు. జిల్లాలోని 385 గ్రామ పంచాయతీల్లో ఇప్పటి వరకు రూ.13,63,30,997 లక్ష్యం ఉండగా.. మార్చి 31 వరకు రూ.13,42,45,321 వసూలు చేశారు. మొత్తంగా 98.47 శాతం వసూలు చేసి రాష్ట్రంలోనే జిల్లా రెండోస్థానంలో నిలిచింది.
నిధులు సమకూర్చుకునేందుకు...
గ్రామపంచాయతీలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులు వస్తున్నా ఆ నిధులు వీధిలైట్ల ఏర్పాటు, బ్లీచింగ్‌పౌడర్, అత్యవసర పనులకు చెల్లించేందుకే ఉపయోగపడుతున్నాయి. మిగతా అభివృద్ధి పనులు చేపట్టేందుకు ఇంటి పన్నుల ద్వారా వచ్చిన నిధులపై దృష్టి సారించారు.
జిల్లాలోని 385 గ్రామ పంచాయతీల్లో ఈ ఏడాది ఇంటి పన్నుల వసూళ్లలో లక్ష్యం చేరుకునేలా చర్యలు చేపట్టాం. మార్చి 31 వరకు రూ.13.42 కోట్లు వసూళ్లు చేపట్టి రాష్ట్రంలోనే రెండోస్థానంలో నిలిచాం. అన్ని గ్రామాల్లో అనుకున్న లక్ష్యాన్ని సాధించాం.
– మదన్‌మోహన్, డీపీవో


