● జగిత్యాల జోరుగా సాగుతున్న ఆట ● చేతులు మారుతున్న కోట్
పేకాటపై ప్రత్యే నిఘా
జగిత్యాలక్రైం: జగిత్యాల జిల్లాలో రోజురోజుకు మూడుముక్కలాట జోరుగా సాగుతోంది. దీంతో కొద్దిరోజులుగా పోలీసులు నిఘా పటిష్టం చేసి రోజుకోచోట పేకాట రాయుళ్లను అరెస్ట్ చేసి వారి నుంచి నగదును సీజ్ చేయడంతోపాటు, వారిపై కేసులు నమోదు చేస్తున్నారు. పేకాటతో ఎన్నో కాపురాలు కూలిపోవడంతోపాటు అప్పుల ఊబిలో కూరుకుపోతుండటంతో పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. అయినప్పటికీ పోలీసుల కళ్లుగప్పి నిత్యం జూదం ఆడుతుండడంతో అనేక కుటుంబాలు ఆర్థికంగా నష్టపోయి ఇబ్బంది పడుతున్నాయి.
మామిడితోటలు, అడవుల్లోనే అడ్డాలు..
పేకాట రాయుళ్లకు మామిడితోటలు, అడవులు అడ్డాగా మారాయి. కొందరు నిర్వాహకులు కొంతమంది పేకాట రాయుళ్లను మచ్చిక చేసుకుని వారికి విందు, వసతులు ఏర్పాటు చేసి అక్కడికే పిలిపిస్తూ పేకాట ఆడిస్తున్నారు. స్థావరాలకు ఎవరూ రాకుండా రహస్యంగా మనుషులను నియమించి పోలీసులు వస్తే సమాచారం ఇచ్చేలా చూస్తున్నారు.
ఇతర జిల్లాల నుంచి వస్తున్న జూదరులు
జిల్లా కేంద్రంతో పాటు పలు మండలాలు, గ్రామాల్లో అటవీప్రాంతాలు, మామిడి తోటల్లో, ఫామ్ హౌస్‌లను వేదిక చేసుకుని పోలీసుల కళ్లు గప్పి పెద్ద ఎత్తున జూదం ఆడుతున్నారు. ఇతర జిల్లాల నుంచి కూడా జూదరులు పెద్ద ఎత్తున జగిత్యాలకు వచ్చి పేకాట ఆడుతున్నారు. రహస్య ప్రాంతాలు, అటవీ ప్రాంతాలు, మామిడి తోటల్లో పేకాట ఆడుతున్న సమయంలో పోలీసులు దాడులు చేస్తే చాలామంది కళ్లుగప్పి పారిపోతున్నారు.
ఏడాది కేసులు నిందితులు రికవరీ(రూ.లలో)
2022 109 536 16,91,045
2023 78 473 18,66,696
2024 89 602 19,40,681
2025 167 1014 30,62,036
గతేడాది డిసెంబర్ 29న కథలాపూర్ మండలం దూలూరులో పేకాట ఆడుతున్న నలుగురిని అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి రూ.3500 స్వాధీనం చేసుకున్నారు.
గతేడాది డిసెంబర్ 18న జగిత్యాల పట్టణంలోని ఓ లాడ్జ్‌లో పేకాట ఆడుతున్న నలుగురిని అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి రూ.11,300 స్వాదీనం చేసుకున్నారు.
పేకాట అరికట్టేందుకు పోలీసు శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశాం. చాలామందిని అరెస్ట్ చేసి వారిపై కేసులు నమోదు చేస్తున్నాం. పేకాటతో చాలా కుటుంబాలు విచ్ఛిన్నమవుతున్నాయి. వీటిని అరికట్టేందుకు పోలీసు శాఖ ప్రతి పోలీస్‌స్టేషన్ పరిధిలో నిఘా పెట్టింది.
– అశోక్‌కుమార్, ఎస్పీ
● జగిత్యాల జోరుగా సాగుతున్న ఆట ● చేతులు మారుతున్న కోట్


