
పాల ధర తగ్గడంతో నష్టపోతున్న పాడిరైతులు
● పాల ధర తగ్గుతోంది.. దాణా ఖర్చు పెరుగుతోంది ● ఇతర రాష్టాల నుంచి వచ్చే పాలను చెక్ చేయాలి ● మాజీ మంత్రి జీవన్‌రెడ్డి
సారంగాపూర్: పాల ధర తగ్గడంతో పాడి రైతులు నష్టపోతున్నారని మాజీమంత్రి జీవన్‌రెడ్డి అన్నారు. పశువులకు అందించే దాణాకు మాత్రం ధర భారీగా పెరుగుతోందన్నారు. సోమవారం మండలంలోని లక్ష్మీదేవిపల్లి, కోనాపూర్ గ్రామాల్లోని రైతుల డెయిరీ ఫాంలను పరిశీలించారు. సారంగాపూర్‌లో విలేకరులతో మాట్లాడారు. పొరుగు రాష్ట్రాల నుంచి పలు డైయిరీ కంపెనీలు రాష్ట్రానికి పాలు ప్యాకెట్ల రూపంలో తీసుకుంటున్నాయని తెలిపారు. ఇక్కడి కంపెనీలు రైతులకు లీటర్‌కు చెల్లించే ధర కంటే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే పాలకు తక్కువ ధర చెల్లిస్తున్నాయని, ఈ క్రమంలో వాటి నాణ్యత చెక్ చేయాలని సూచించారు. లీటర్‌కు రూ.5 ప్రోత్సాహకం అందిస్తామని ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున హామీ ఇచ్చామని, ఇప్పుడు అమలు చేయాలని జీవన్‌రెడ్డి కోరారు. ఈ విషయంపై సీఎంకు లేఖ రాశారు. ఆయన వెంట కాంగ్రెస్ నాయకులు రాంచంద్రారెడ్డి, శేఖర్, గంగారాం, మహిపాల్‌రెడ్డి, రాజిరెడ్డి, ఆనందరెడ్డి తదితరులు పాల్గొన్నారు.