
ఎస్సారెస్పీపైనే ఆశలు
● భారీ వర్షాలు కురిస్తేనే ప్రాజెక్టులోకి నీరు
● 23.866 టీఎంసీలకు చేరిన నీటిమట్టం
● నీరు విడుదల చేయాలని రైతుల డిమాండ్
జగిత్యాల అగ్రికల్చర్: ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సాగు, తాగునీరు అందించే శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి నాలుగైదు రోజులుగా కురుస్తున్న వర్షాలకు వరద చేరుతోంది. ఆయకట్టుకు విడుదల చేసేస్థాయిలో ప్రాజెక్టు నీటిమట్టం పెరగకపోవడంతో, నీటి విడుదలపై సందిగ్ధం నెలకొంది. మొన్నటి వరకు వర్షాలు లేక, పంటలు ఎండిపోతుండటంతో నీరు విడుదల చేయాలని జిల్లాలోని కథలాపూర్, మెట్‌పల్లి రైతులు ఆందోళనకు దిగారు.
● ఎగువప్రాంతాల్లో వర్షాలు అంతంతే
ఎస్సారెస్పీ ప్రాజెక్టు ఎగువ ప్రాంతాల్లో వర్షాలు పెద్దగా లేకపోవడంతో నీరు చేరడం లేదు. రెండేళ్లలో జూలై నెలలోనే ప్రాజెక్టు నిండింది. జిల్లా ఆయకట్టు రైతులకు రెండు పంటలకు సాగునీరు ఇచ్చారు. ప్రాజెక్టుకు చెందిన కాకతీయ, సరస్వతి, లక్ష్మీ కాలువలకే కాకుండా వరదకాలువకు సైతం పలుమార్లు నీటిని వదిలారు. ప్రాజెక్టు నిండిన తర్వాత ఐదారుసార్లు గేట్లు ఎత్తి వరదను గోదావరిలోకి వదిలారు.
● జిల్లాలో 4.50 లక్షల ఎకరాల్లో సాగు
జగిత్యాల జిల్లాలో వానాకాలం సీజన్‌లో దాదాపు 4.50 లక్షల ఎకరాల్లో పంటలు సాగుకానున్నాయి. ఇందులో వరి 3 లక్షల ఎకరాల్లో సాగుచేసే అవకాశముంది. వరికి సాగునీటి అవసరం ఎక్కువ. ప్రస్తుతం వ్యవసాయ బావుల్లో ఉన్న నీటితోనే వరి నాట్లు వేస్తున్నారు. ప్రాజెక్టు నిండుతుందనే ఆశతో రైతులు సాగు చేస్తున్నారు. ఇప్పుడే వరద వచ్చే అవకాశం లేకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. వ్యవసాయ బావుల్లో ఉన్న నీరు సైతం ప్రధాన పొలం దున్నేందుకు సరిపోవడం లేదని చెపుతున్నారు. లక్షన్నర ఎకరాల్లో సాగయ్యే మొక్కజొన్న, పసుపు పంటలకు వర్షం నీరు సరిపోతుంది. తప్పని పరిస్థితుల్లో డ్రిప్ ద్వారా సాగునీరు అందిస్తున్నారు.
● ప్రాజెక్టులో 23.866 టీఎంసీలు
ఎస్సారెస్పీ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 1091.00 అడుగులు కాగా, ప్రస్తుతం ప్రాజెక్టులో 1070.30 అడుగుల నీరుంది. నీటి నిల్వ సామర్థ్యం 80.5 టీఎంసీ(గతంలో 90.3 టీఎంసీ)లకు ప్రస్తుతం 23.866 టీఎంసీలు ఉంది. ప్రాజెక్టులోకి ఈ సీజన్‌లో జూన్ 1 నుంచి 13.045 టీఎంసీల నీరు చేరింది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో సగటున ప్రాజెక్టులోకి 10,484 క్యూసెక్కుల నీరు చేరుతోంది. గతేడాది ఈ సమయానికి ప్రాజెక్టు నీటి మట్టం 1073.60 అడుగులు ఉండగా, నీటి నిల్వ సామర్థ్యం 29.933 టీఎంసీలుగా ఉంది. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 50,503 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోంది. 622 క్యూసెక్కుల ఔట్‌ఫ్లో వెళ్తోంది.కాగా.. కథలాపూర్, మెట్‌పల్లి ప్రాంత రైతులు ఎస్సారెస్పీ నీటిని విడుదల చేయాలని ఆందోళన చేస్తున్నారు.
ఎదురుచూస్తున్నాం
ఎస్సారెస్పీ ప్రాజెక్టు జిల్లాకు వరప్రదాయినీ. ఈ ప్రాజెక్టు ద్వారా జగిత్యాల జిల్లాకే ఎక్కువ నీరు అందుతుంది. ప్రాజెక్టు నీరు రాకపోతే పంటలు సాగుచేయడం కష్టం. చాలామంది వరినాట్లు వేసి ఎస్సారెస్పీ నీటి కోసం ఎదురుచూస్తున్నారు.
– వేముల కరుణాకర్, ధర్మపురి
ప్రాజెక్టు నిండాలి
ఖరీఫ్ సీజన్‌కు ఆన్, ఆఫ్ పద్ధతిలో ఎస్సారెస్పీ నీరు విడుదల చేయాలి. ఇప్పటి వరకు వ్యవసాయ బావిలో ఉన్న నీటితో నాట్లు వేసుకున్నాం. బావుల్లో సరిపోయేంత నీరు లేదు. ప్రాజెక్టు తొందరగా నిండి, వానాకాలం, యాసంగి పంటలకు నీరు అందించాలి. – నక్కల తిరుపతి రెడ్డి,
తొంబరావుపేట, మేడిపల్లి

ఎస్సారెస్పీపైనే ఆశలు

ఎస్సారెస్పీపైనే ఆశలు