
గోశాల.. గోస తీరేనా.!
వేములవాడరూరల్: కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలతో పాటు కొత్త పథకాలను ప్రవేశపెడుతోంది. రాష్ట్రంలోని గోశాలల్లో అధునాతనమైన గోశాలను నిర్మించాలని ఇందుకు 21 ప్రాంతాలను ఎంపికచేసింది. అందులో భాగంగానే రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం పరిధిలో ఉన్న గోశాలను 50 ఎకరాల స్థలంలో నిర్మించాలని ప్రతిపాదనలు సిద్ధం చేసింది. గోవుల పోషణ, సంరక్షణకు పశుసంవర్ధక, రెవెన్యూ, దేవాదాయ శాఖల భూముల్లో ఈ గోశాలను నిర్మించాలని ఇంతకుముందు జరిగిన కేబినెట్ సమావేశంలో నిర్ణయించారు. రాజన్న ఆలయ గోశాల కోసం వేములవాడ రూరల్ మండలం మర్రిపల్లిలోని 748 సర్వేనంబర్‌లో 50 ఎకరాల స్థలాన్ని రెవెన్యూ శాఖ అధికారులు ఇప్పటికే గుర్తించారు. ప్రభుత్వం నుంచి అనుమతులు రాగానే ఈ ప్రాంతంలో గోశాల నిర్మించనున్నారు.
ఏటా కోట్లాది రూపాయల ఆదాయం..
రాజన్నకు భక్తులు మొక్కుబడిగా కోడెలు సమర్పిస్తారు. కొందరు ఆలయంలో కోడె మొక్కులు చెల్లించుకుంటారు. కోడె మొక్కులతో ఏటా ఆలయానికి కోట్లాది రూపాయలు ఆదాయం సమకూరుతోంది. తిప్పాపూర్‌లో మూడెకరాల స్థలంలో దాదాపు 400 కోడెలు ఉంటాయి. ఆలయంలో భక్తుల మొక్కు చెల్లింపుల కోసం సమీపంలోని గోశాల వద్ద కొన్ని కోడెలు సిద్ధంగా ఉంచుతారు. వీటి సంరక్షణ కోసం ఏఈవో స్థాయి అధికారి పర్యవేక్షణలో కోడెల బాగోగులు చూసుకుంటారు. భక్తులు పశుగ్రాసం వితరణగా అందిస్తారు. ఇటీవల వరుసగా కోడెలు మృత్యువాత పడటంతో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా ప్రత్యేక దృష్టిసారించారు. రాజన్న గోశాల కోసం ప్రత్యేకంగా అధునాతనమైన గోశాల నిర్మించాలని ఎమ్మెల్యే సీఎంకు వివరించారు. స్పందించిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వేములవాడ గోశాల కోసం 50 ఎకరాల స్థలం గుర్తించి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు. ఈ క్రమంలో రెవెన్యూ శాఖ అధికాారులు మర్రిపల్లిని 748 ప్రభుత్వ స్థలాన్ని 50 ఎకరాలుగా గుర్తించి అందులో హద్దులు ఏర్పాటు చేశారు.
మర్రిపల్లిలో 50 ఎకరాల్లో గోశాల
అనుమతుల రాగానే నిర్మాణ పనులు
కేబినెట్ ఆమోదంతో
హర్షంవ్యక్తం చేస్తున్న భక్తులు