
ఆడుకుంటూ వెళ్లి.. నీటిబకెట్‌లో పడి..
జూలపల్లి(పెద్దపల్లి): సరదాగా ఆడుకుంటూ వెళ్లిన చిన్నారి గుండు సాన్వీ(21నెలలు) నీటిబకెట్‌లో పడి చనిపోయింది. పెద్దపల్లి జిల్లా పెద్దాపూర్ గ్రామంలో ఈ విషాదకర ఘటన చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. పెద్దాపూర్ గ్రామానికి చెందిన గుండు సతీశ్ – రవళి దంపతులు. వీరికి ఒక మారుడు, ఒక కూతురు ఉన్నారు. కొడుకు పెద్దవాడు, కూతురు సాన్వీ ఇంట్లో సందడిచేస్తూ ఉండేది. ఈక్రమంలోనే ఈనెల 27న రాత్రి 7.00 గంటల సమయంలో ఇంట్లో ఆడుకుంటోంది. చిన్నారి తల్లిదండ్రులు ఇంటి పనుల్లో నిమగ్నయ్యారు. అయితే, ఇంట్లో ఆడుకుంటూ క్రమంగా బయటకు వెళ్లింది. ఆ తర్వాత ఇంటి ఆవరణలోనే ఆడుకుంటూ సమీంలోని నీటి బకెట్ వద్దకు చేరుకుంది. అక్కడ నీటిని చేతితో తాకేందుకు యత్నించగా బకెట్‌లో తలకిందులుగా పడిపోయింది. ఆ వెంటనే గమనించిన చిన్నారి పెద్దనాన్న నరేశ్ కరీంనగర్‌లోని ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే చిన్నారి మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతురాలు తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై సనత్‌కుమార్ తెలిపారు.