
ఆర్థిక అక్షరాస్యతకు ‘జన సురక్ష’
జగిత్యాలజోన్: గ్రామీణ ప్రజలకు బ్యాంకుల సేవలు అందిస్తున్నప్పటికీ ఆర్థిక కార్యకలాపాలపై సరైన అవగాహన లేక ముందుకు వెళ్లలేకపోతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే పథకాలనూ సరిగ్గా అందుకోలేకపోతున్నారు. ఈ క్రమంలో కేంద్రప్రభుత్వం గ్రామీణ ప్రజల్లో ఆర్థిక అక్షరాస్యత పెంచేందుకు జిల్లా లీడ్ బ్యాంకు ఆధ్వర్యంలో ప్రతి గ్రామ పంచాయతీలో సదస్సులు నిర్వహిస్తోంది. సదస్సుల్లో మహిళాశక్తి గ్రూపులు, ఆశావర్కర్లు, అంగన్‌వాడీలను భాగస్వామ్యం చేయాలని సంకల్పించింది. పోస్టర్లు, బ్యానర్ల ద్వారా విస్తృతంగా ప్రచారం చేయాలని నిర్ణయించింది.
● ప్రతిగ్రామంలో జనసురక్షా క్యాంపులు
జిల్లాలో 320 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఈ గ్రామాల్లో సెప్టెంబర్ 30 వరకు జనసురక్ష క్యాంపులు కొనసాగనున్నాయి. కేంద్రంలోని ఫైనాన్సియల్ సర్వీసెస్ డిపార్ట్‌మెంట్ ఆధ్వర్యంలో జిల్లాలోని అన్ని బ్యాంకులు గ్రామీణాభివృద్ధి శాఖ సహకారంతో ఆర్థిక అక్షరాస్యత పెంచేందుకు జనసురక్ష క్యాంపులు నిర్వహిస్తోంది. ప్రతిరోజూ రెండుమూడు గ్రామాల్లో సదస్సులు చేపడుతోంది. ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి.. అక్కడికక్కడే ఆధార్‌నంబర్, మొబైల్ నంబర్, ఫొటో, బ్యాంకు అకౌంట్‌తో అనుసంధానం చేస్తున్నారు.
● బీమా, పెన్షన్ పథకాలపై ఫోకస్
కేంద్ర ప్రభుత్వం బ్యాంకు ఖాతా ఉన్న ప్రతిఒక్కరికీ బీమా, పెన్షన్ పథకాలను అందించాలని నిర్ణయించింది. కొంతకాలంగా ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన, జీవన్‌జ్యోతి బీమా యోజన పథకాలను తీసుకొచ్చినప్పటికీ.. ఈ పథకాల్లో చేరని వారి సంఖ్య ఇంకా ఎక్కువగానే ఉంది. ఈ పథకాల్లో చేరిన ఖాతాదారులు చనిపోతే రెండు పథకాల కింద రూ.4లక్షల బీమా అందుతుంది. అలాగే గ్రామీణప్రాంత ప్రజలకు పెన్షన్ ఇచ్చేందుకు అటల్ పెన్షన్ యోజన పథకాన్ని తీసుకొచ్చినప్పటికీ.. గ్రామాల్లోని 18 నుంచి 40 ఏళ్ల యువకుల్లో సరైన అవగాహన లేక చాలమంది పథకానికి దూరమవుతున్నారు. ఈ పెన్షన్ పథకం కింద 60 ఏళ్లతర్వాత రూ.5వేల పెన్షన్ వస్తుంది.
● నామినీ విషయాలు తెలియక..
బ్యాంకు ఖాతాదారులు చనిపోయినప్పుడు నామినీ ఎవరూ ఉండకపోవడంతో డబ్బులు బ్యాంకుల్లోనే మురిగిపోతున్నాయి. ఇందుకోసం ప్రతి ఖాతాదారులు తమ బ్యాంకు ఖాతాలో తన తదనంతరం ఆ డబ్బులు ఎవరికి చెందాలో అనే విషయాలపై వివరిస్తున్నారు. చాలా ఖాతాల్లో నామినీ చనిపోయినప్పటికీ.. ఖాతాదారుడు నామినీని మార్చకపోవడంతో ఇబ్బందులు ఏర్పడుతున్న విషయాలను ఉదాహరణలతో చెపుతున్నారు. ఇలా బ్యాంకు ఖాతాలకు సంబంధించి నామినీ విషయాలపై అవగాహన పెంచుతున్నారు. ప్రతి ఖాతాదారుడు పదేళ్ల తర్వాత రీ–కైవెసీ చేయించుకోవాలని.. తద్వారా ఖాతాల లావాదేవీల్లో ఇబ్బందులు ఉండవని సూచిస్తున్నారు. ఖాతాదారులు చనిపోతే నామినీలు ఎలా డబ్బులు పొందాలనే విషయంపై బ్యాంకర్లు వివరిస్తున్నారు.
● డిజిటల్ బ్యాంకింగ్‌పై అవగాహన
బ్యాంకులో ఖాతా ఉన్నప్పటికీ.. డిజిటల్ బ్యాంకు కార్యాకలపాలు ఎలా నిర్వహించాలనే విషయాలు చాలామందికి తెలియడం లేదు. సురక్షితంగా డిజిటల్ లావాదేవీలు ఎలా చేయాలనే దానిపై ప్రయోగాత్మకంగా వివరిస్తున్నారు. సెల్‌ఫోన్ ద్వారా గుగూల్ పే, ఫోన్‌పే ఎలా వాడాలి..? బ్యాలెన్స్ డబ్బులు ఎలా చూసుకోవచ్చు..? వంటివి వివరించే ప్రయత్నం చేస్తున్నారు. డిజిటల్ వ్యవహారాలు చేసేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని.. లేదంటే సైబర్ నేరగాళ్ల వలలో చిక్కే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. సైబర్ సమస్య వచ్చినప్పుడు వెంటనే 1930కు ఫోన్ చేయాలని సూచిస్తున్నారు.
చాలా విషయాలు తెలియడం లేదు
గ్రామీణ ప్రజలకు బ్యాంకులకు సంబంధించిన చాలా విషయాలు తెలియడం లేదు. డబ్బులు వేసుడు, తీసుడు మాత్రమే తెలుసు. బ్యాంకులు నిర్వహించే అన్ని రకాల కార్యకలాపాలపై ప్రజలకు జన సురక్ష క్యాంపుల ద్వారా అవగాహన కల్పించడం మంచి పరిణామం.
– ఎల్క కమలాకర్, సంగెంశ్రీరాంపూర్
అవగాహన పెంచుతున్నాం
గ్రామీణ ప్రజలకు బ్యాంకు కార్యకలాపాలపై అవగాహన పెంచుతున్నాం. ముఖ్యంగా మహిళలు బ్యాంకుల్లో ఎదుర్కొనే ఇబ్బందులపై చర్చించడంతోపాటు ఆయా సమస్యలను పరిష్కరిస్తున్నాం. బీమా, పెన్షన్ పథకాలపై పూర్తి స్థాయిలో వివరిస్తున్నాం.
– జి.రాంకుమార్, లీడ్ బ్యాంకు మేనేజర్

ఆర్థిక అక్షరాస్యతకు ‘జన సురక్ష’

ఆర్థిక అక్షరాస్యతకు ‘జన సురక్ష’