
సైబర్ నేరాలతో విలవిల
● మోసాలతో రూ.లక్షలు లూటీ చేస్తున్న కేటుగాళ్లు ● పెద్ద సంఖ్యలో నమోదవుతున్న కేసులు ● రికవరీ చేయడం పోలీసులకు కష్టంగా మారిన వైనం
మెట్‌పల్లి: జిల్లాలో సైబర్ నేరాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. సాధారణ వ్యక్తులే కాకుండా ఉన్నత విద్యావంతులు కూడా వీటి బారిన పడి తమ బ్యాంకు ఖాతాల్లో ఉన్న రూ.లక్షల సొమ్మును పోగొట్టుకుంటున్నారు. దొంగతనాలు, దోపిడీల ద్వారా కంటే ప్రస్తుతం సైబర్ నేరాలతోనే పోగొట్టుకునే సొత్తు ఎక్కువగా ఉండడం గమనార్హం. ప్రజలు ఈ తరహా నేరాల బారిన పడకుండా ఉండడానికి పోలీస్ శాఖ పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నప్పటికీ ఫలితం లేకుండా పోతోంది. మరోవైపు ఈ కేసులను పరిష్కరించడం.. కాజేసిన సొత్తును రికవరీ చేయడం పోలీసులకు కష్టంగా మారింది.
ఆర్థిక మోసాలే అధికం
● సైబర్ నేరగాళ్లు అనేక రకాల మోసాలకు పాల్పడుతున్నప్పటికీ ఎక్కువ శాతం ఆర్థిక మోసాలే ఉంటున్నాయి.
● డెబిట్, క్రెడిట్ కార్డుల అప్‌డేట్, తక్కువ వడ్డీకి రుణాలు, షేర్ మార్కెట్‌లో పెట్టుబడులకు అధిక లాభాలు, ఉపాధి, ఉద్యోగాల పేరుతో నమ్మించి బ్యాంకు ఖాతాల్లో నుంచి సొమ్మును సులభంగా లూటీ చేస్తున్నారు.
కష్టంగా మారిన రికవరీ
● సైబర్ నేరాలను నియంత్రించడం, లూటీ అయిన సొమ్మును రికవరీ చేయడం పోలీసులకు సవాల్‌గా మారుతోంది.
● సాధారణ దొంగతనాలు, తదితర కేసుల్లో కాజేసిన సొమ్మును రికవరీ చేయడం సులభంగా మారింది. వీటిల్లో నిందితుల ప్రమేయం నేరుగా ఉండడంతో సీసీ పుటేజీలు, వేలిముద్రలతోపాటు ఇతర సాంకేతిక ఆధారాల సహాయంతో చేధిస్తున్నారు.
● సైబర్ నేరగాళ్లు వేర్వేరు దేశాల్లో, రాష్ట్రాల్లో ఉంటూ సాంకేతికంగా చిక్కకుండా జాగ్రత్తలు తీసుకుంటుండడంతో వారిని గుర్తించి పట్టుకోవడం, సొమ్మును రికవరీ చేయడం పోలీసులకు కష్టంగా మారింది.
● ఈ కారణంగానే నమోదవుతున్న కేసుల్లో అతి తక్కువ శాతం మాత్రమే పరిష్కారం అవుతున్నాయి.
లబోదిబోమంటున్న బాధితులు..
● సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడి రూ.లక్షలు పోగొట్టుకుంటున్న బాధితులకు ఏళ్లు గడుస్తున్నా తిరిగి అవి చేతికి అందడం లేదు.
● ప్రధానంగా సైబర్ నేరగాళ్ల బారిన పడిన వారిలో మధ్య తరగతి కుటుంబాలకు చెందిన వారే ఎక్కువగా ఉన్నారు. పోయిన సొమ్ము రాకపోవడంతో వారంతా ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
● పట్టణానికి చెందిన ఓ వ్యక్తి క్రెడిట్ కార్డుకు సంబంధించిన సొమ్మును సైబర్ నేరగాళ్లు కాజేశారు. ప్రస్తుతం ఆ సొమ్మును తిరిగి చెల్లించడం అతనికి సాధ్యం కావడం లేదు. బ్యాంకు అధికారులు ఒత్తిడి చేస్తుండడంతో ఏమి చేయాలో తెలియడం లేదని అవేదన వ్యక్తం చేస్తున్నాడు.
మెట్‌పల్లికి చెందిన బాలచిన్నయ్య మే 16న తన క్రెడిట్ కార్డు లావాదేవీలను తెలుసుకోవడానికి కస్టమర్ కేర్‌గా భావించి ఓ నంబర్‌కు ఫోన్ చేశాడు. ఆ నంబర్ నుంచి మాట్లాడిన వ్యక్తి అతని క్రెడిట్ కార్డు వివరాలను తెలుసుకుని.. ఓటీపీ ద్వారా వెంటవెంటనే రూ.1.66లక్షలు కాజేశాడు. కొద్దిసేపటికే బాలచిన్నయ్య తాను మోసపోయానని గ్రహించి సైబర్ క్రైమ్ ట్రోల్ ఫ్రీ నంబర్ 1930కు ఫోన్ చేసి సమాచారం అందించాడు. రెండు నెలలు గడిచినా ఇంతవరకు ఆ కేసులో ఎలాంటి పురోగతీ లేకపోవడంతో బాధితుడు తీవ్ర ఆవేదన చెందుతున్నాడు.
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
సైబర్ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. నేరగాళ్లు ఎన్నో విధాలుగా నమ్మించి మోసాలకు పాల్పడుతున్నారు. వీటి పట్ల అవగాహన కలిగి ఉండాలి. గుర్తు తెలియని వ్యక్తులకు బ్యాంకు ఖాతాల వివరాలు, ఓటీపీ వంటి సమాచారాన్ని ఇవ్వకూడదు. మోసానికి గురైతే తక్షణమే ట్రోల్ ఫ్రీ నెంబర్ 1930కు ఫోన్ చేసి తెలపడంతో పాటు స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలి.
– కిరణ్‌కుమార్, ఎస్సై, మెట్‌పల్లి

సైబర్ నేరాలతో విలవిల