నెరవేరనున్న దశాబ్దాల కల | - | Sakshi
Sakshi News home page

నెరవేరనున్న దశాబ్దాల కల

Jul 28 2025 8:15 AM | Updated on Jul 28 2025 8:17 AM

● సూరమ్మ ప్రాజెక్టు మత్తడి నిర్మాణం పూర్తి ● కాలువల భూసేకరణకు రూ.10 కోట్లు మంజూరు ● ఆనందంలో అన్నదాతలు

కథలాపూర్‌: కథలాపూర్‌, మేడిపెల్లి, బీమారం మండలాల రైతుల దశాబ్దాల కల నెరవేరనుంది. కాంగ్రెస్‌ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కలిగోట శివారులోని సూరమ్మ ప్రాజెక్టు కోసం ఉద్యమాలు చేపట్టింది. అధికారంలోకి రాగానే ప్రాజెక్టు పనులు ప్రారంభించింది. ఇప్పుడు పనులు సాగుతున్నాయి. ఎల్లంపల్లి ఎత్తిపోతల పథకం ఫేజ్‌–2 స్టేజీ–1 పనుల్లో భాగంగా ప్రాజెక్టు నిర్మించి కుడి, ఎడమ కాలువల ద్వారా మెట్టప్రాంతమైన కథలాపూర్‌, మేడిపెల్లి, బీమారం, రుద్రంగి మండలాల్లో 50వేల ఎకరాలకు సాగు నీరందించడం లక్ష్యం. ప్రాజెక్టు మత్తడి పనులు పూర్తికాగా కాలువలకు తూముల నిర్మాణం చేపడుతున్నారు. మూడు రోజుల క్రితం కాలువ పనుల భూసేకరణకు రూ.10 కోట్లు మంజూరు కావడంతో పంటల సాగుకు తొందరలోనే నీరందుతుందని ఈ ప్రాంత రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

కాలువ పనులకు 2018లో భూమిపూజ

బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో సూరమ్మ ప్రాజెక్టు కుడి, ఎడమ కాలువ పనులకు రూ.204 కోట్లు మంజూరు చేశారు. 2018 జూన్‌ 22న అప్పటి నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు భూమిపూజ చేశారు. పనులు చేపట్టకపోవడంతో అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్‌ నేత ఆది శ్రీనివాస్‌తోపాటు నాలుగు మండలాల కాంగ్రెస్‌ నాయకులు పలుమార్లు నిరసనలు తెలిపారు. తాము అధికారంలోకొస్తే ప్రాజెక్టును పూర్తి చేసి కాలువ పనులు చేపడుతామని హామీ ఇచ్చారు. అనుకున్నట్లుగానే పనులు కావడంతో ఈ ప్రాంత రైతులు ఆనందంలో ఉన్నారు.

కాలువల భూసేకరణకు రూ.10 కోట్లు

సూరమ్మ ప్రాజెక్ట్‌ కుడి, ఎడమ కాలువ పనుల భూసేకరణకు మూడు రోజుల క్రితం ప్రభుత్వం రూ.10 కోట్లు మంజూరు చేసింది. ఆ నిధులను కలెక్టర్‌ ఖాతాలో జమ చేసింది. మూడు నెలల క్రితం రెవెన్యూ, నీటిపారుదలశాఖ అధికారులు కాలువ పనుల్లో భూములు కోల్పోతున్న రైతులతో గ్రామసభలు నిర్వహించారు. వారి నుంచి అభిప్రాయాలు కూడా సేకరించారు. భూసేకరణకు రూ.10 కోట్లు కేటాయించడంతో నిర్వాసితులకు పరిహారం చెల్లిస్తే కాలువ పనులు త్వరలోనే ప్రారంభం కానున్నాయని రైతులు అంటున్నారు. ఈ ప్రాంతంలో బీడు భూములు సాగులోకి రానుండగా... చేపలు పెంచడంతో మత్స్యసంపద పెరుగుతుందని రైతులు, మత్స్యకారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

నెరవేరనున్న దశాబ్దాల కల1
1/1

నెరవేరనున్న దశాబ్దాల కల

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement